వారు తక్కువ.. వీరు ఎక్కువ !

ఏపీలో కరోనా వైరస్‌ (కొవిడ్‌ – 19) అందరినీ హడలెత్తిస్తోంది. అక్కడ పెద్ద ఎత్తున పరీక్షలు చేస్తున్నా పాజటివ్‌ల సంఖ్య కూడా భారీగానే బయటపడుతోంది. అయితే, ఇటీవల కాలంలో ఒక విషయం ఆ రాష్ట్ర పాలకులను, ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తోంది. ఆ రాష్ట్రంలో ఇప్పుడు కరోనా నుంచి కోలుకుంటున్న వారికంటే రెండు మూడు రెట్లు కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. దీంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. గడచిన 24 గంటలలో కోలుకుని 391 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అవ్వగా, 998 మందికి కొత్తగా వైరస్‌ సోకింది. రాష్ట్రంలో 24 గంటల్లో 14 మంది మృతి చెందారు. అందులో కర్నూలులో అత్యధికంగా ఐదుగురు మృతి చెందగా, అనంతపురంలో ముగ్గురు, చిత్తూరు, కడపలో ఇద్దరేసీ, కృష్ణా, విశాఖలో ఒక్కొక్కరు మరణించారు. ఇప్పటి వరకు స్వల్పంగానే కేసులు నమోదవుతున్న శ్రీకాకుళంలో ఒక్కసారిగా 96 కొత్త కేసులను గుర్తించారు.

దీంతో ఆ జిల్లాలో బాధితుల సంఖ్య 189కు పెరిగింది. ఏపీలో ఇప్పటి వరకు మొత్తం 18,697 మంది వైరస్‌ బారినపడగా, మృతుల సంఖ్య 232కు పెరిగినట్లు ఏపీ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ఆదివారం బులిటెన్‌ను విడుదల చేసింది. గుంటూరు జిల్లాలో మరోసారి కరోనా కోరలు చాచింది. ఒక్కరోజే జిల్లాలో కొత్తగా 157 కేసులు బయటపడంతో, జిల్లాలో మొత్తం బాధితుల సంఖ్య 1,827కు పెరిగింది. ఇప్పటికే కర్నూలు జిల్లాలో 2,451 మందికి వైరస్‌ సోకగా, అనంతపురం జిల్లాలో 2,186 మంది వ్యాధిబారినపడ్డారు. అనంతపురం జిల్లాలో కొత్తగా మరో 87 కేసులు బయటపడ్డాయి. రాష్ట్రంలో శనివారం ఉదయం పది గంటల నుంచి ఆదివారం ఉదయం పది గంటల వరకు 20,567 శాంపిల్స్‌ను పరీక్షించగా, 961 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 36 మంది, విదేశాల నుంచి వచ్చిన మరొకరికి పాజిటివ్‌ ఉన్నట్లు గుర్తించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 10,17,140 మందికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా, దేశంలో ఇదే అత్యధిక సంఖ్యని ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలో కరోనా ఉధృతి చూస్తుంటే కేసుల సంఖ్య 20 వేలకు చేరువలో ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం 18,697 కేసులకు 8,422 మంది కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. మరో 10,043 మంది కొవిడ్‌ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. గడచిన 24 గంటలలో తూర్పు గోదావరి జిల్లాలో 118, కర్నూలు జిల్లాలో 97, శ్రీకాకుళం జిల్లాలో 96, విశాఖ జిల్లాలో 88, అనంతపురం జిల్లాలో 87, చిత్తూరు జిల్లాలో 74, కృష్ణా జిల్లాలో 62, కడప జిల్లాలో 52, నెల్లూరు జిల్లాలో 45, పశ్చిమ గోదావరి జిల్లాలో 40, ప్రకాశం జిల్లాలో 27, విజయనగరం జిల్లాలో 18 కేసులు నమోదయ్యాయి.

corona deathscorona positivescorona updates in apCorona virus in APcovid-19latest telugu newsTelugu breaking newstelugu news