గాంధీ వైద్యుల సేవలు బ్రహ్మాండం: సిఎం కెసిఆర్

హైదరాబాద్: ఇలాంటి క్లిష్ట సమయంలో ప్రజలకు అండగా వుండి బ్రహ్మాండంగా సేవలు  చేస్తున్నారని సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి వైద్యులను సిఎం కెసిఆర్ అభినందించారు. మీరు చేస్తున్న ఉత్తమ సేవలను కొనసాగించండి, మీకు ఏ సమస్య తలెత్తినా, ఏ విధమైన అవసరం ఉన్నా సంప్రదించాలని సిఎం వారిని కోరారు.

నేను సంపూర్ణంగా మీకు సహకారం అందిస్తా అని వారికి భరోసానిచ్చారు. ఇవాళ సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో సిఎం కెసిఆర్ తనిఖీ చేశారు. మధ్యాహ్నం గాంధీ కి చేరుకున్న సిఎం గంటపాటు కోవిడ్ పేషెంట్లున్న వార్డులను కలియతిరిగి వారికి అందుతున్న వైద్య చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు. బెడ్ల వద్దకు వెళ్లి పేషెంట్ల తో నేరుగా మాట్లాడారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. గాంధీలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ ను ఈ సందర్భంగా కెసిఆర్ పరిశీలించారు. నిమిషానికి రెండు వేల లీటర్ల ఆక్సీజన్ ను తయారు చేసే ఆక్సిజన్ ప్లాంట్ ను ఇటీవలే నెలకొల్పారు. ప్లాంటు పనిచేసే విధానం గురించి, ఆక్సిజన్ స్వచ్ఛత గురించి అడిగి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కాంట్రాక్టు నర్సులతో, జూనియర్ డాక్టర్లతో కెసిఆర్ మాట్లాడారు.

ప్రాణాలకు తెగించి కరోనా రోగులకు సేవలందిస్తున్నారని వారిని అభినందించారు. ఎటువంటి ఇబ్బంది ఉన్నా పరిష్కరిస్తామని, ఇలాంటి క్లిష్ట సమయంలో ప్రజల కోసం నిలబడాల్సిన అవసరం యువ డాక్టర్లపై ఉందని సిఎం అన్నారు. జూనియర్ డాక్టర్లు, నర్సుల సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యల కోసం ప్రతిపాదనలను తక్షణమే పంపాలని వైద్య శాఖ అధికారులను సిఎం ఆదేశించారు. ఈ పర్యటనలో ఆర్థిక శాఖ మంత్రి టి.హరీష్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, వైద్యారోగ్యశాఖ కార్యదర్శి ఎస్ఎఎం. రిజ్వీ పాల్గొన్నారు.

cm kcrcm kcr at gandhi hospitalgandhi doctorslatest telugu newsTelugu breaking newstelugu news