చంద్రబాబు ఎన్నికల బహిష్కరణ

అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని తీరును తప్పుబడుతూ ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు టిడిపి అధ్యక్షుడు ఎన్.చంద్రబాబు నాయుడు తెలిపారు.

ఈ ఎన్నికల్లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రబ్బర్ స్టాంపుగా మారారని ఆయన ఆరోపించారు. ఇవాళ ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికలపై టిడిపి పొలిట్ బ్యూరో సమావేశం జరగ్గా, మెజారిటీ సభ్యులు ఎన్నికలను బహిష్కరించాలని కోరారు. ఆ తరువాత మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. ఈ నెలలో జరగనున్న ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ఆయన తెలిపారు. 2014 లో జరిగిన ఎన్నికల్లో 2 శాతం ఎంపిటిసీలు ఏకగ్రీవం అయితే ఈసారి 24 శాతం ఏకగ్రీవాలు అయ్యాయన్నారు. అదే విధంగా అప్పుడు జెడ్పిటిసిలు 1 శాతం అయితే ఇప్పుడు 19 శాతం అని ఆయన వివరించారు. వైసిపి దౌర్జన్యాలు, అక్రమాలతోనే బలవంతపు ఏకగ్రీవాలు అయ్యాయని చంద్రబాబు ఆరోపించారు.

ఎన్నికలపై పార్టీల అభిప్రాయం తీసుకుంటామని చెప్పి నీలం సాహ్ని… నోటిఫికేషన్ ఇచ్చి, ఆ తరువాత అఖిల పక్ష సమావేశాలు నిర్వహించారన్నారు. ఈ ఎన్నికలు సజావుగా జరుగుతాయన్న నమ్మకం తమకు లేదని, అందుకే బహిష్కరిస్తున్నామన్నారు. తమ పార్టీ నిర్ణయాన్ని అభ్యర్థులు అర్థం చేసుకుంటారని, వారందరికి భవిష్యత్తులో న్యాయం చేసతానని చంద్రబాబు హామీ ఇచ్చారు. తన రాజకీయ జీవితంలో ఇంత కఠిన నిర్ణయం ఎప్పుడూ తీసుకోలేదన్నారు. పుదుచ్చేరి ఎన్నికల్లో ప్రత్యేక హోదా ఇస్తామని బిజెపి ప్రకటించిందని, అక్కడ బిజెపి అభ్యర్థులకు మద్దతుగా వైసిపి నాయకులు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

సోదరి ప్రశ్నలకు జగన్ సమాధానం చెప్పాలి…

మాజీ ఎంపి వైఎస్.వివేకానంద రెడ్డి హత్యపై ఆయన కుమార్తె డాక్టర్ సునీత అడుగుతున్న ప్రశ్నలకు సోదరుడిగా సిఎం జగన్ రెడ్డి ఏం సమాధానం చెబుతారని చంద్రబాబు ప్రశ్నించారు. సునీత ప్రశ్నలకు ప్రభుత్వం వద్ద సమాధానాలు లేవన్నారు. సిబిఐ విచారణలో నిజాలు బయటకు రాకుండా సాగదీస్తున్నారని ఆయన ఆరోపించారు.

ap electionsap tdpchandrababu boycottscm jagan reddydr sunitha reddymptc electionsneelam sahney