సోషల్ మీడియాపై కేంద్రం ఉక్కుపాదం భేష్: విజయశాంతి

హైదరాబాద్: సోషల్ మీడియాలో చెత్తను నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపడాన్ని బిజెపి నాయకురాలు విజయశాంతి రెడ్డి సమర్థించారు. భావ ప్రకటనా స్వేచ్ఛ మన దేశంలో ఉన్నట్లుగా ఎక్కడా లేదన్నారు.

సోషల్ మీడియాపై నియంత్రణ ఉండాలని గతంలో తను పలుమార్లు చెప్పానని, ఇప్పటికైనా కేంద్రం నిర్ణయం తీసుకున్నందుకు అభినందిస్తున్నట్లు విజయశాంతి రెడ్డి తెలిపారు. గత కొద్ది సంవత్సరాలుగా వ్యక్తిగత కక్షలతో, వర్గం మీద కోపంతో, కులాల మీద అక్కసుతో, లింగ వివక్షతో పోస్టులు చేస్తున్నారన్నారి ఆమె తెలిపారు. ఇలాంటి తప్పుడు పోస్టుల మూలాలను కనిపెట్టి దోషులను శిక్షించడం కోసమే కొత్త నిబంధనలు తీసుకువచ్చారన్నారు. వినియోగదారుల వ్యక్తిగత భద్రతకు భంగం వాటిల్లకుండా కేంద్రం చర్యలు తీసుకోవడం అభినందనీయమన్నారు. సోషల్ మీడియాలో ఎవరైనా వివాదాస్పద అంశంపై పోస్టు చేసినప్పుడు వారి వివరాలు చెప్పాలని, శాంతి భద్రతలు, దేశ సార్వభౌమాధికారికి విఘాతం కలిగించే పోస్టుల సమాచారాన్ని దర్యాప్తు సంస్థలకు ఇవ్వాలని కేంద్రం స్పష్టం చేసిందని విజయశాంతి రెడ్డి చెప్పారు.

కేంద్రాన్ని విమర్శిస్తున్నవారికి చైనాలో సోషల్ మీడియాపై ఎలా ఉక్కుపాదం మోపిందో తెలియదా అని ఆమె ప్రశ్నించారు. చైనా దేశానికి చెందిన యాప్ లు, సైట్లను మాత్రమే వినియోగించాలని పూర్తి కట్టడి చేసి విజయవంతమైందన్నారు. ఆ దేశం నుంచి వీసమెత్తు సమాచారం కూడా బయటకు పొక్కడం లేదన్నారు. చైనా దేశం కఠిన ఆంక్షల గురించి కమ్యూనిస్టులు గాని కాంగ్రెస్ నాయకులు కాని నోరెత్తరని విజయశాంతి రెడ్డి అన్నారు.

Actress Vijayashantidigital mediaFace booksocial mediatwitter apppwhatsapp app