తెలంగాణ అక్రమ ప్రాజెక్టులను ఆపాలి: జగన్ లేఖ

అమరావతి: కృష్ణా జలాలపై తెలంగాణ నిబంధనలు ఉల్లంఘిస్తోందని ఏపి సిఎం వైఎస్.జగన్ మోహన్ రెడ్డి కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు లేఖ రాశారు. తెలంగాణలోని అక్రమ ప్రాజెక్టులు తొలుత సందర్శించాలని తన లేఖ లో కోరారు.
ఆ తర్వాతే రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టులను సందర్శించాలని అన్నారు. తెలంగాణ ప్రాజెక్టులను ముందు పరిశీలించేలా కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కెఆర్ఎంబి) ని ఆదేశించాలన్నారు. కెఆర్ఎంబి సూచనలను తెలంగాణ పదేపదే ఉల్లంఘిస్తోందన్నారు. తెలంగాణ వైఖరితో ఏపీ తన వాటా జలాలను కోల్పోతోందని తెలిపారు. తెలంగాణ వైఖరితో కృష్ణా జలాలు సముద్రంలో కలుస్తున్నాయన్నారు. శ్రీశైలం లో 834 అడుగుల కన్నా తక్కువున్నా విద్యుదుత్పత్తి చేస్తున్నారు.

జూన్ 1 నుంచి విద్యుదుత్పత్తికి తెలంగాణ 19 టీఎంసీలు వాడిందని ఆరోపించారు. తెలంగాణ ఇలాగే వ్యవహరిస్తే శ్రీశైలం నిండడం దాదాపు అసాధ్యమన్నారు. 854 అడుగులు లేకుంటే పోతిరెడ్డిపాడుకు గ్రావిటీ ద్వారా నీరు తీసుకెళ్లలేమన్నారు. పోతిరెడ్డిపాడుపై ఆధారపడిన ప్రాజెక్టులకు జలాలు రావు అని జగన్ తెలిపారు. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు తాగునీటి ఇబ్బందులు తప్పవని తెలిపారు. కెఆర్‌ఎంబి అనుమతి లేకుండానే సాగర్‌లో తెలంగాణ విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నారు. కృష్ణాపై ఇరురాష్ట్రాల ప్రాజెక్టులను కెఆర్‌ఎంబి నియంత్రణలోకి తేవాలని కోరారు. ఇరురాష్ట్రాల ప్రాజెక్టుల వద్ద సిఐఎస్‌ఎఫ్‌ భద్రత కల్పించాలని జగన్ ఆ లేఖ లో జలశక్తి మంత్రి ని కోరారు.

latest telugu newsTelugu breaking newstelugu news