FbTelugu

అగ్రరాజ్యం కకావికలం

ప్రపంచంలోనే అగ్రరాజ్యం. అన్ని దేశాలను తన గుప్పిట్లో పెట్టుకొని ఏలుతున్న దేశం. ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందామని చెప్పుకుంటున్న దేశం. ప్రపంచంలోనే తనకు ఎదురు లేదని విర్రవీగుతున్న దేశం అమెరికా. కరోనా ధాటికి అతలాకుతలం అవుతోంది.

ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా అథఃపాతాళానికి పడిపోయింది. హలో లక్ష్మణా అంటూ తలలు పట్టుకుంటోంది. ఆ దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయింది. 1933, 2008 సంక్షోభాల కంటే తీవ్రమైన ఆర్థిక సంక్షోభం దిశగా అమెరికా సాగుతోంది. ఈ విషయాన్ని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అమెరికా కార్మిక శాఖ గురువారం విడుదల చేసిన నివేదిక ప్రకారం గతవారంలో నిరుద్యోగ బీమా కోసం 24 లక్షల మంది నమోదు చేసుకున్నారు. దీంతో మార్చి నెల మధ్య నుంచి ఇప్పటి వరకూ ఈ బీమాకు నమోదు చేసుకున్న వారి సంఖ్య 38.6 మిలియన్లకు చేరుకుంది.

ఒకవైపు కరోనా వైరస్‌ బాధితులు, మరణాలు పెరుగుతున్నా, ఆర్థిక వ్యవస్థను పునఃప్రారంభించేందుకు 50 రాష్ట్రాల్లోనూ లాక్‌డౌన్‌ నిబంధనలు సడలిస్తూ ట్రంప్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా వరసగా 9వ వారం కూడా 2 మిలియన్లకు పైగా కార్మికులు నిరుద్యోగ బీమా కోసం దరఖాస్తు చేసుకోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. మార్చి చివరిలో గరిష్టంగా నమోదు చేసుకున్న 6.8 మిలియన్ల మంది సంఖ్యతో పోలిస్తే ప్రస్తుత సంఖ్య తక్కువగా కనిపిస్తున్నా, 2008 మహా మాంద్యం కంటే ఈ సంఖ్య చాలా ఎక్కువ.

ఒక అంచనా ప్రకారం జూన్‌ మొదటివారంలో అధికారంగా విడుదల చేయనున్న మే నెలలోని నిరుద్యోగం 20 శాతంగా ఉండనుంది.గత నెలలో నిరుద్యోగం 14.7 శాతంగా ఉంది. అయితే అమెరికాలో నిరుద్యోగ శాతం ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఫార్చూన్‌ పత్రిక అంచనా ప్రకారం అమెరికాలో ప్రస్తుతం నిరుద్యోగం 22.5 శాతానికి చేరుకుంది. ఇది 1933 మహామాంద్యంలో నిరుద్యోగ శాతం (25)కు దగ్గరగా ఉంది. కరోనా కాలంలో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతినడంతో అమెరికా పాతకాలం నాటి ఆర్థిక స్థితికి చేరింది. ఇప్పుడు ఆ దేశంలో నిరుద్యోగంతో పాటు అనేక రకాల సమస్యలు విలయతాండవం చేస్తున్నాయి.

You might also like