FbTelugu

ఒంటిమిట్టలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

కడప: ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో సోమ‌వారం ఉదయం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఆలయంలో ఏప్రిల్ 21 నుండి 29వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్న విషయం విదితమే.

బ్రహ్మోత్సవాల ముందు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. ఇవాళ ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి అర్చన నిర్వహించారు. ఉదయం 6.30 నుండి 8 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరిగింది. ఇందులో భాగంగా గర్భాలయం, శ్రీ ఆంజనేయస్వామి, శ్రీగరుత్మంతుని సన్నిధి, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులను ఉదయం 9 గంటల నుండి సర్వదర్శనానికి అనుమతించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, పూజారులు పాల్గొన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.