FbTelugu

ఆరేళ్లలో అన్నీ కబ్జాలే: రేవంత్ రెడ్డి

హైదరాబాద్: వందేళ్లలో హైదరాబాద్ ఎంత ఆక్రమణలకు గురైందో తెలంగాణ వచ్చిన తర్వాత ఆరేళ్లలో అంత విధ్వంసం జరిగిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్ రెడ్డి విమర్శించారు.
ఐటీ మంత్రి కేటిఆర్ అనుచరులు, సహచరులు చెరువులు, పార్కుల కబ్జాకు పాల్పడుతున్నారన్నారు. ఇవాళ ఆయన హైదరాబాద్ లో మీట్ ది ప్రెస్ లో మాట్లాడుతూ, వరదల్లో పదిలక్షల కుటుంబాలు నిరాశ్రయులు కావడానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమన్నారు. ప్రపంచంలో అత్యధికంగా అబద్ధాలు ఉన్న పుస్తకం కేటిఆర్ విడుదల చేసిన ప్రగతి నివేదిక అన్నారు. మెట్రో రైలుకు టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఏం సంబంధం ఉంది?. ఫోజులు కొట్టి ఫొటోలు దిగితే యజమానులు అయిపోతారా?. గ్రేటర్ హైదరాబాద్ లో రూ.67వేల కోట్లు ఖర్చు పెట్టినట్లు చెబుతున్న మాటలు పచ్చి అబద్ధమన్నారు. రూ.6వేల కోట్లు మాత్రమే ప్రభుత్వం గ్రేటర్ లో ఖర్చు చేసిందన్నారు.

సిసి కెమెరాలు చిల్లర దొంగల కోసం పెట్టడం కాదు చెరువులు, ప్రభుత్వ స్థలాల దగ్గర పెట్టాలి. అప్పుడే కబ్జాలు ఆగుతాయన్నారు. కార్మిక శాఖ మంత్రి సి.మల్లారెడ్డి రెండు మెడికల్ కాలేజీలు చెరువుల్లోనే కట్టారు. తెలంగాణ వచ్చిన తర్వాత నాలుగువేల బడులు మూసేశారు. టిఆర్ఎస్ వచ్చాక ఒక్క యూనివర్శిటీ కట్టలేదు. మీ సొంత మనుషులే భూబ్జాలు పెడుతున్నారు కదా? అన్నారు. శాండ్, ల్యాండ్, వైన్, మైన్ మాఫియాలు అన్నీ టిఆర్ఎస్ చేతుల్లోనే ఉంది. పేకాట క్లబ్బులు మూసినతర్వాత ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ వచ్చింది. ఒక మంత్రి అల్లుడి కంపెనీ ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ నడిపిస్తున్నది. ప్రభుత్వ పెద్దల కనుసైగల్లో గ్యాంబ్లింగ్ నడుస్తున్నదని రేవంత్ ఆరోపించారు.
గుట్కా వ్యాపారం ఒక మంత్రి వియ్యంకుడు నడుపుతున్నడు. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రశ్నించే గొంతులను కాలుపెట్టి తొక్కి నలిపేస్తున్నదన్నారు. అమర వీరుల స్థూపం, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం కట్టలేదు కాని, విలాసవంతమైన ప్రగతి భవన్ కట్టిండు, సచివాలయం కూలగొట్టుడు చేశాడని ఆయన ధ్వజమెత్తారు. ప్రశ్నించే గొంతులు చట్టసభల్లో ఉండాలి. లేకుంటే పత్రికలకు పని ఉండదు. ప్రజలకు మేలు జరగదన్నారు. మైనార్టీలకు ప్రమాదకరంగా ఎంఐఎం పార్టీ మారిందన్నారు.

2016 జిహెచ్ఎంసి ఎన్నికల మేనిఫెస్టోను టిఆర్ఎస్ వెబ్ సైట్ నుంచి ఎందుకు తొలగించారు?. రూ.20వేల కోట్లతో రోడ్లు వేస్తామని చెప్పారు కానీ నాలుగంటే నాలుగే రోడ్లు వేసి ప్రచారం చేసుకుంటున్నారు. అది కూడా మీ దగ్గరి బంధువు రియల్ ఎస్టేట్ కంపెనీ ప్రయోజనం కోసమేనన్నారు. మెట్రో రైలు 72 కిలోమీటర్లు అని రాశారు కానీ 67 కిలోమీటర్లు మాత్రమే పూర్తయింది. గౌలిగూడ నుంచి పలక్ నామా వరకు పూర్తయితేనే 72 అవుతుందిన్నారు. ఐకియా ఫర్నీచర్ షాప్ వాడు ఫ్రీ గా ఇచ్చిన మడత మంచాలను టిమ్స్ ఆసుపత్రిలో వేశారు తప్ప కొనలేదు. కరోనా సమయంలో ప్రజలు కష్టాలు పడుతుంటే వెయ్యి రూ.1500 కోట్ల కుంభకోణానికి కేసిఆర్ కుటుంబం తెర తీసిందన్నారు.
పార్టీ పుట్టిన చోట తెలంగాణలో తక్కువ సీట్లలో పోటీ చేసి ఉత్తరప్రదేశ్, బీహార్ లో మొత్తం సీట్లకు పోటీ చేయడంలో ఆంతర్యమేంటి?. దీనికి ఎంఐఎం సమాధానం చెప్పాలన్నారు. జిహెచ్ఎంసిలో కూడా తక్కువ సీట్లలో ఎంఐఎం ఎందుకు పోటీ చేస్తున్నదో ప్రజలు తెలుసుకోవాలన్నారు. నైతిక విలువలు అనేవి బిజెపిలో ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయాయి. వాజ్ పాయి, అద్వానీ ఉన్న సమయంలో ఆ పార్టీలో విలువలు ఉన్నాయి. ఎన్నికలొచ్చినప్పుడల్లా కేసిఆర్ ఫ్రంట్లు, టెంట్ల గురించి మాట్లాడతుంటడు. సీఎం కేసీఆర్ ఇంటికి రూ.11 లక్షలు ఇంటిపన్ను పెండింగ్ లో ఉందన్నారు. జిహెచ్ఎంసిలో 80 సీట్లు అధికార పార్టీకి ఇచ్చినా… మరో 70 సీట్లు ప్రతిపక్షానికి ఇవ్వాలని ప్రజలను కోరుతున్నాని రేవంత్ రెడ్డి అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.