FbTelugu

అందరి చూపూ గవర్నర్‌ వైపు

ఇప్పుడు అందరి చూపు ఏపీ గవర్నర్‌ వైపే ఉంది. ఆయన తీసుకునే నిర్ణయంపై అంతా టెన్షన్‌గా ఎదురుచూస్తున్నారు. ఆయన నిర్ణయం హైకోర్టు తీర్పునకు అనుగుణంగా ఉంటుందా.. లేక రాష్ట్ర ప్రభుత్వం వైపు ఉంటుందా అన్న అంశం హాట్‌ టాపిక్‌గా మారింది.

మరికొన్ని గంటల్లో ఈ టెన్షన్‌ తొలిగే అవకాశాలున్నాయి. ఏపీలో రాష్ట్ర ఎన్నికల అధికారిగా నిమ్మగడ్డ రమేష్‌కు బాధ్యతలు అప్పగించే నిర్ణయం ఈ రోజు ఉదయం 11.30కు తేలనుంది. ఏపీ ప్రభుత్వం తమకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారన్న కారణంతో ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్‌ను ఏపీ సర్కారు పదవి నుంచి తొలగించింది. ఆఫ్‌కోర్స్‌ ఈ నిర్ణయాన్ని అమలు చేసి కొత్త అధికారిగా కనకరాజును ఎన్నికల అధికారిగా నియమించింది గవర్నరే అనుకోండి.

కానీ, ఇప్పుడు తనను పదవి నుంచి అక్రమంగా తొలగించారని నిమ్మగడ్డ కోర్టుకు వెళ్లడంతో ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఆ తీర్పును అమలు చేయలేదు. దీంతో నిమ్మగడ్డ మళ్లీ హైకోర్టు మెట్లెక్కారు. దీంతో హైకోర్టు ఈ సారి రాష్ట్ర ప్రభుత్వం వైఖరిని తీవ్రంగా ఆక్షేపించింది. విమర్శలు కూడా చేసింది. అసలు మా నిర్ణయాన్ని అమలు చేయాల్సింది గవర్నర్‌ కదా అని భావించింది. అందుకే వెంటనే వెళ్లి తనకు విధులు అప్పగించాలని గవర్నర్‌కు విజ్ఞాపన పత్రం అందించాలని హైకోర్టు నిమ్మగడ్డకు సూచించింది. వాస్తవానికి భారతదేశ చరిత్రలో ఎన్నడూ కోర్టులు గవర్నర్‌ను కలవాలని సూచించలేదు. ఇప్పటివరకూ ప్రభుత్వాలకే సూచనలు, ఆదేశాలు జారీ చేశాయి తప్ప ఇలాంటి పరిస్థితి ఎన్నడూ ఎదురవ్వలేదు.

కానీ, ఏపీలో నిమ్మగడ్డ వ్యవహారంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం, హైకోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోకపోవడంతో నిమ్మగడ్డ బంతిని గవర్నర్‌ కోర్టులోకి పంపేసింది. కోర్టు సూచనలతో నిమ్మిగడ్డ గవర్నర్‌ను కలిసేందుకు అపాయింట్‌మెంట్‌ కోరారు. దీంతో తనను కలిసేందుకు నిమ్మగడ్డకు సోమవారం ఉదయం 11.30 గంటలకు టైమిచ్చారు. నిమ్మగడ్డ విజ్ఞప్తి విన్న తర్వాత గవర్నర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా అని ఇప్పుడు సాధారణ జనంతో పాటు రాజకీయ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. కోర్టు తీర్పును అమలు చేసేలా గవర్నర్‌ నిర్ణయం ఉంటుందా..? నిమ్మగడ్డకు బాధ్యతలు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేస్తారా..? ఒకవేళ ఆయన ఆదేశాలిచ్చినా జగన్‌ సర్కారు దాన్ని అమలు చేస్తుందా..? లేక గవర్నర్‌ నిమ్మగడ్డ విజ్ఞప్తిని తిరస్కరించి కోర్టు ధిక్కారానికి పాల్పడతారా..? ఒకవేళ గవర్నర్‌ కోర్టు ధిక్కారానికి పాల్పడితే రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయి అన్న అంశాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతున్నాయి. సో, ఈ ఉత్కంఠకు తెరపడాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.

You might also like