FbTelugu

అందరి చూపు మోదీ వైపు !

దేశంలో ఇటీవల కాలంలో కరోనా బాధితుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. లాక్‌డౌన్‌ అమలులో ఉన్న కాలంలో ప్రపంచ కరోనా పట్టికలో అట్టడుగున ఉన్న భారత్‌ లాక్‌డౌన్‌ సడలింపు తర్వాత అమాంతం ఎగబాకి నాలుగో స్థానానికి చేరింది.

ప్రతిరోజూ పదివేలకు పైగానే కేసులు నమోదవుతున్నాయి. వందల్లో మరణాలు సంభవిస్తున్నాయి. ఇప్పటికే దేశంలో మూడు లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఇండియాలో మరోసారి లాక్‌డౌన్‌ విధించే అవకాశాలున్నాయని సోషల్‌ మీడియాలో జోరుగా ప్రసారం సాగుతోంది. కరోనా నియంత్రణకు ప్రధాని మోదీ ఏం చర్యలు తీసుకుంటారోనని అంతా ఆయన నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు.

దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి రంగంలోకి దిగారు. ముఖ్యమంత్రులతో సమావేశానికి ముందుగా కేంద్ర సీనియర్‌ మంత్రులు, ఉన్నతాధికారులతో శనివారం సమగ్ర సమీక్ష నిర్వహించారు. అత్యధిక కేసులు నమోదవుతున్న ప్రాంతాల్లో వైరస్‌ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ నెల 16, 17వ తేదీల్లో సీఎంలతో సమావేశం అనంతరం ప్రధాని మరో దఫా అత్యంత కీలకమైన కఠిన చర్యలు తీసుకునే అవకాశాలున్నాయన్న ప్రచారం కూడా సాగుతోంది.

వర్షాకాలం నేపథ్యంలో కేసులు తీవ్రస్థాయిలో పెరుగుతున్నందున రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో చర్చించి యుద్ధ ప్రాతిపదికన ప్రణాళికలు రూపొందించి, చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ కార్యదర్శిని ప్రధాని ఆదేశించారు. దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్న రీత్యా రాబోయే రెండు నెలల్లో చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్, సీఎం, కేంద్ర, రాష్ట్ర, మునిసిపాలిటీ అధికారులతో తక్షణం సమావేశమై సమగ్రమైన, సమన్వయంతో కూడిన చర్యలు తీసుకోవాలన్నారు. అయితే, ఈ చర్చల అనంతరం ప్రధాని ఏం నిర్ణయం తీసుకోబోతున్నారన్న దానిపై ఇప్పుడు అందరిలో టెన్షన్‌ నెలకొంది. ఆర్థిక ఇబ్బందులు తలెత్తినా పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ విధిస్తేనే దేశంలో మళ్లీ కరోనాకు చెక్‌ పెట్టవచ్చన్న భావన చాలామందిలో ఉంది. ఈ నేపథ్యంలో పీఎం తీసుకోబోయే నిర్ణయం కోసం అందరూ ఎదురు చూస్తున్నారు.

You might also like