FbTelugu

బాబు, కేంద్రం వల్లే విద్యుత్ ఛార్జీలు పెరిగాయి: అజేయ కల్లం

హైదరాబాద్‌: గత ప్రభుత్వం, కేంద్రం చేసిన కొన్ని ఒప్పందాల వల్లే ఏపీలో విద్యుత్ ధరలు పెరిగాయని ఏపీ సీఎం ముఖ్య సలహాదారు, రిటైర్డు ఐఏఎస్ అధికారి అజేయ రెడ్డి కల్లం తెలిపారు.

2014లో అన్ని విద్యుత్ సంస్థల అప్పు కలిపి రూ 24,800 కోట్లు ఉండగా నేడు అది రూ.70,000 కోట్లకు పెరిగిందన్నారు. అవినీతి, తప్పుడు ఒప్పందాల వల్లే ఈ అప్పులు ఇంతగా పెరిగాయన్నారు. ఈ అప్పులకు వడ్డీలు కట్టడం వల్ల కూడా విద్యుత్ చార్జీలపై ప్రభావం పడుతోందని ఆయన వివరించారు. గత టీడీపీ ప్రభుత్వం వెళుతూ రూ.40 వేల కోట్ల పెండింగ్‌ బిల్లులు పెట్టిందని అజేయ రెడ్డి కల్లం వివరించారు.
విద్యుత్ టారిఫ్‌పై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యానికి గురిచేశాయన్నారు. ఏపీలో పరిశ్రమలకు యూనిట్ విద్యుత్ ధర రూ.7.65ల టారిఫ్ గత ప్రభుత్వమే నిర్ణయించిందన్నారు. మా ప్రభుత్వం వచ్చిన తరువాత దీనిలో ఎలాంటి మార్పు చేయలేదని ఆయన స్పష్టం చేశారు. కేంద్రం రూ.2.70పైసలకే యూనిట్ విద్యుత్ ఇస్తుందని కేంద్రమంత్రి చెప్పడం శుద్ద తప్పని ఆయన అన్నారు.

ఎన్టీపీసీ రూ.9.84పైసలకు యూనిట్ విద్యుత్ ఇస్తోందని, వద్దన్నా ఈ విద్యుత్‌ను ఏపీకి అంటగడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక మెగావాట్ విద్యుత్ ట్రాన్స్‌మిట్ చేసినందుకు ఏపీ నుంచి రూ.5 లక్షలు వసూలు చేస్తున్నారు. పక్క రాష్ట్రం వారు విద్యుత్ తీసుకుంటున్నా ట్రాన్స్‌మిషన్ చార్జీలు మనం చెల్లించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
కేంద్రానికి ఏడాదికి ట్రాన్స్‌మిషన్ చార్జీలే రూ.1700కోట్లు ఏపీ చెల్లిస్తోంది. కేంద్రం చేసిన ఒప్పందాలను ఇప్పటి వరకు ఎక్కడా ఏపీ ఉల్లంఘించలేదని అజేయ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏపీకి బొగ్గు గనులు కేటాయించలేదన్నారు. ప్రత్యేక బొగ్గు గనుల కేటాయింపులు లేకపోవడం వల్ల ఏడాదికి రూ.2,500కోట్లు అదనంగా ఏపీ చెల్లిస్తోందన్నారు. ఈ భారం ప్రజలపై కాకుండా ఎవరిపై వేస్తామని అజేయ రెడ్డి కల్లం అన్నారు.

You might also like