FbTelugu

అమ్మో.. అబ్దుల్లాపూర్‌మెట్టా ?

Ah-Abdullahpurmet

అబ్దుల్లాపూర్‌ మెట్.. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అందరి నోళ్లలో నానుతున్న పేరు. హైదరాబాద్‌ నగరానికి ఆనుకొని ఉంది. ఇంకా బాగా అర్ధం కావాలంటే రామోజీ ఫిలింసిటీ ఉంది ఆ ఊరిలోనే. అక్కడ రామోజీ ఫిలిం సిటీ ఉన్నా అంతగా ప్రాచుర్యం లేని ఆ ఊరు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల జనం నోళ్లలో నానుతోంది. దీనికి కారణం అక్కడి తహసీల్దార్‌ విజయారెడ్డి హత్య. ఈ ఘటనలో నిందితుడితో పాటు తహసీల్దార్, ఆమె డ్రైవర్‌ ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారు. విజయారెడ్డి హత్యతో ఇక్కడ తహసీల్దార్‌ పోస్టు ఖాళీగా ఉంది. అయితే, ఇక్కడ విధులు నిర్వహించడానికి ఏ తహసీల్దారూ ముందుకు రావడం లేదు. అమ్మో.. అబ్దుల్లాపూర్‌మెట్టా అంటూ పారిపోతున్నారు.

ఎందుకంత భయం

అబ్దుల్లాపూర్‌మెట్‌లో తహసీల్దార్‌గా పనిచేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. కారణమేంటంటే.. ఇక్కడ భూముల ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. అదే రీతిలో ఇక్కడ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం జోరుగా సాగుతోంది. ఇందులో రాజకీయ జోక్యం పెరిగింది. పలుకుబడి ఉన్న నేతలు, అధికారులు ఇక్కడ భూములను కాజేసేందుకు పూనుకున్నారు. ఆ భూములను తమ పేరుతో మార్చాలని తహసీల్దార్‌పై ఒత్తిడి తెస్తున్నారు. ఇలాంటి భూ వివాదంలోనే అధికారి హత్యకు గురైంది. ఇలాంటి భూ వివాదాలు ఇక్కడ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఇక్కడ తహసీల్దార్‌గా పనిచేస్తే ఒత్తిళ్లకు తలొగ్గకపోతే పెద్దలకు కోపం వస్తుంది.. తలొగ్గితే బాధితుల నుంచి ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందోనన్న ఆందోళనలో రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. దీంతో ఇక్కడ పనిచేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు.

You might also like