FbTelugu

అత్తమీద కోపం దుత్తమీద వెళ్లదీసినట్టు!

అత్తమీద కోపం దుత్తమీద వెళ్లదీసింది అన్నది పాతకాలం నాటి సామెత. ఓ కోడలికి అత్తగారి మీద కోపం వచ్చిందట. కానీ, పాపం అత్తగారిని అడిగే ధైర్యం ఆ కోడలికి లేదు. దీంతో అత్తగారి మీద కోపం అంతా ఓ కుండమీద వెళ్లదీసిందట. అత్తను ఏమీ అనలేక ఆ కోపంతో కుండ (దుత్త) ఎత్తేసిందట. తెలంగాణ రాష్ట్ర పాలకుల పరిస్థితి ఇప్పుడు సరిగ్గా ఇలాగే ఉందన్న చర్చ సాగుతోంది. ఉన్నత ఉద్యోగుల అవినీతిని అడ్డుకోలేక చిరుద్యోగులపై తమ ప్రతాపాన్ని చూపారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రెవెన్యూ వ్యవస్థలో అవినీతి బాగా పెరిగిపోయిందని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. వెంటనే దీనిని అరికట్టడం కోసమంటూ రెవెన్యూ ప్రక్షాళన మొదలు పెట్టింది. దీనిలో భాగంగా వీఆర్‌ఏల వ్యవస్థను తొలగించింది. వారి వద్ద ఉన్న రికార్డులను కూడా తహసీల్దార్‌లకు అప్పగించేలా ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఈ ప్రక్రియ పూర్తయింది.

ఇక, వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు అన్నీ తహసీల్దార్లే చేపడతారని, దీనివల్ల ఆ శాఖలో అవినీతి లేకుండా చేస్తామని సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. కానీ, ఇక్కడ ఒక విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి. రెవెన్యూ శాఖలో అవినీతి భారీగా ఉందన్న విషయాన్ని అందరూ ఒప్పుకోవాల్సిందే. ఇటీవల ఇలాంటి కేసులు ఏసీబీ అధికారులకు చాలా దొరకుతున్నాయి. ఒకటి అర కాదు.. ఏకంగా కోట్ల రూపాయల్లో లంచాలు తీసుకుంటున్న ఘటనలు వెలుగు చూశాయి. అయితే, ఈ కేసుల్లో దొరికింది వీఆర్‌ఓలు కాదు, తహసీల్దార్, ఆర్డీఓ, డిప్యూటీ కలెక్టర్ల స్థాయివారే. ఇంకా ఈ కేసుల్లో కలెక్టర్లు కూడా ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. ఈ తరుణంలో చిరు ఉద్యోగులైన వీఆర్‌ఓలను అవినీతి పేరుతో తొలగించి అనకొండల్లా అవినీతికి పాల్పడుతున్న ఉన్నత ఉద్యోగులకే పట్టం గట్టింది ప్రభుత్వం. దొంగచేతికే తాళాలు ఇచ్చినట్టుగా ఈ వ్యవహారం ఉందని విపక్షాలు సైతం విమర్శలకు దిగుతున్నాయి.

భారీగా అవినీతికి పాల్పడుతున్న అధికారులకే మళ్లీ రెవెన్యూ పగ్గాలు అప్పగించడం వల్ల అవినీతి ఎలా తగ్గుతుందో తెలియడం లేదని మేథావులు కూడా ఆలోచనలో పడ్డారు. ప్రభుత్వం, పాలకులు కఠినంగా ఉంటే తప్ప అవినీతి నిర్మూలన సాధ్యం కాదని, ప్రభుత్వం అవినీతిని పట్టించుకోనంత కాలం పరిస్థితి ఇలాగే ఉంటుందన్న వాదన కూడా వినిపిస్తోంది. అయితే, ప్రభుత్వం పెద్దలు భారీగా దండుకునేందుకే చిరుద్యోగులపై అవినీతి ముద్ర వేసిందన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. చివరకు సర్కారు నిర్ణయం ఎలాంటి ఫలితాలను ఇస్తుందో చూడాలి మరి.

You might also like