FbTelugu

థర్డ్ వేవ్ తరుముకొస్తొంది…?: ఏయిమ్స్ చీఫ్ హెచ్చరిక

ఆంటోని ఫౌచి వ్యాఖ్యాలతో ఏకీభవించిన గులేరియా
ఒక రాష్ట్రంలో లాక్ డౌన్ తో లాభం లేదు
అమెరికా లాంటి పరిస్థితులు దేశంలో తలెత్తుతాయి
న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ తో ఇప్పటికే జనానికి, పాలకులకు కంటినిండా నిద్ర కరవు కాగా, థర్డ్ వేవ్ వస్తోందంటూ వైద్య నిపుణులు చేసిన హెచ్చరికతో దేశ ప్రజలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకోవాల్సిన దుస్థితికి చేరింది.
ఇప్పటికే సెకండ్ వేవ్ కారణంగా రోజురోజుకు పెరుగుతున్న కరోనా వైరస్‌ కేసులు, మరణాలతో భారతదేశం ఉక్కిరిబిక్కిరవుతోంది. ప్రజలు పెద్ద ఎత్తున అనారోగ్యం బారిన పడుతుండడంతో భారతదేశం తల్లడిల్లుతోంది. ప్రస్తుతం కరోనా కట్టడికి ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు ఏమాత్రం ఫలించడం లేదు. భారతదేశం తీసుకుంటున్న చర్యలు ఫలితాన్ని ఇవ్వవు అని అమెరికా అంటు వ్యాధుల నిపుణుడు ఆంటోని ఫౌఛి హెచ్చరించారు. వైరస్ నియంత్రణలోకి రావాలంటే లాక్ డౌన్ మినహా మరో గత్యంతరం లేదని, సైన్యాన్ని రంగంలోకి దించాలని స్పష్టం చేశారు.

ఢిల్లీ ఏయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా కూడా పెదవి విరుస్తున్నారు. ప్రస్తుత కట్టడి చర్యలు కరోనాను ఏమాత్రం నియంత్రించలేదని హెచ్చరించారు. రాత్రిపూట కర్ఫ్యూ, వారాంతపు లాక్‌డౌన్‌తో ఎలాంటి ప్రయోజనం లేదని.. కరోనా వ్యాప్తిని అడ్డుకోలేదని ఆయన కుండబద్దలు కొట్టారు. కరోనా థర్డ్ వేవ్‌కు సిద్ధంగా ఉండాలని రణ్‌దీప్‌ గులేరియా ప్రజలను, ప్రభుత్వాలను అప్రమత్తం చేశారు. థర్డ్ వేవ్ తీవ్రత నుంచి తప్పించుకోవాలంటే సంపూర్ణ లాక్‌డౌనే ఏకైక పరిష్కారం అని స్పష్టం చేశారు. కరోనా కట్టడికి మూడు మార్గాలు ఆయన సూచించారు. ఆంటోని ఫౌచి సూచించిన విధంగానే గులేరియా కూడా సూచనలు చేశారు. ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పన పెంచాలి, ఉప్పెనలా దూసుకురాబోతున్న థర్డ్ వేవ్‌ కట్టడికి వ్యాక్సిన్లు వేసే ప్రక్రియను వేగం చేయాలి, ప్రజల మధ్య భౌతిక దూరం పెంచి, ఒకచోట ఉండకుండా చూసుకోవాలని గులేరియా వ్యాఖ్యానించారు. ఈ చర్యలు తీసుకుంటే కేసులు తగ్గేందుకు ఆస్కారం ఉందని అన్నారు. దేశ హితం కోసం పాలకులు లాక్‌డౌన్‌ కఠినంగా అమలు చేయాలన్నారు. కొన్ని ప్రాంతాలకే లాక్‌డౌన్‌ పరిమితమైతే అమెరికా మాదిరి మన దేశంలో పరిస్థితి ఉంటుందని ఆయన అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.