FbTelugu

స్వలింగ వివాహానికి వ్యతిరేకం: కేంద్రం

ఢిల్లీ: స్వలింగ జంటల మధ్య వివాహాన్ని మన సమాజం ఒప్పుకోదని, అందుకే ఇలాంటి వివాహాలను అనుమతించలేని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టుకు స్పష్టం చేసింది.

హిందూ వివాహ చట్టం, ప్రత్యేక వివాహ చట్టం కింద స్వలింగ వివాహాలకు అనుమతించాలని కోరుతూ దాఖలైన పిటీషన్ ను ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీఎన్.పటేల్, జస్టిస్ ప్రతీక్ జలాన్ లు విచారించారు. కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు విన్పించారు. స్వలింగ జంటల వివాహాలను చట్టబద్దం చేయాలని, బాధితులకు ఊరట కల్పించాలని పిటీషనర్ కోరారు. దీనిపై తుషార్ మెహతా వాదిస్తూ, స్వలింగ జంటల మధ్య వివాహాన్ని మన చట్టాలు, సమాజం, న్యాయవ్యవస్థ గుర్తించడం అసాధ్యమని అన్నారు. ఇలాంటి వివాహాలకు అనుమతిస్తూ పిటీషనర్ కోరిన ఊరట కల్పించడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.

ఇందుకు అనుమతిస్తే చట్ట నిబంధనలకు వ్యతిరేకమని హైకోర్టుకు స్పష్టం చేశారు. హిందూ వివాహ చట్టంలో వివాహాల నియంత్రణ, వివాహేతర సంబంధాల నివారణకు పలు నిబంధనలు భార్యాభర్తల గురించి ప్రస్తావిస్తాయని తెలిపారు. స్వలింగ జంటల్లో ఈ పాత్రలను ఎలా చూస్తారని మెహతా అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా పద్దతులు మారిపోతున్నాయని, అయితే అవి భారత్ కు వర్తిస్తాయా లేదా అనేది వేరే విషయమని హైకోర్టు వ్యాఖ్యానించింది.
ఇద్దరి అంగీకారంతో జరిగే స్వలింగ సంపర్క చర్యలను సుప్రీంకోర్టు నేరపూరిత స్వభావం నుంచి తొలగించినా, ఆ జంటల వివాహం ఇప్పటికీ జరగడం లేదని పిటీషనర్ తరఫు వారు వాదించారు. వీరి వివాహాన్ని రిజిష్టర్ చేసేందుకు నిరాకరణకు గురైన వ్యక్తుల పేర్లు ఇవ్వాలని హైకోర్టు పిటీషనర్ తరఫు న్యాయవాదిని ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 21వ తేదీకి వాయిదా వేసింది.

You might also like