FbTelugu

ఇన్నాళ్లకు తెలిసొచ్చిందా..!

భారత ప్రధాని మోదీకి ఇప్పుడు ఒక విషయాన్ని యమా అర్జంటుగా గుర్తించారు. అదే స్థానిక ఉత్పత్తుల గురించి. అంతర్జాతీయ బ్రాండ్లకు బదులు స్వదేశీ వస్తువులను వాడాలని.. అది అవసరమే కాదు. బాధ్యత కూడా అని సెలవిచ్చారు.

ఇదే విషయాన్ని దశాబ్ధాల నుంచి వామపక్షాలు దేశంలో అనేకసార్లు ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లాయి. విదేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులకు సుంకం తగ్గించడం వల్ల స్వదేశీ వస్తువులకు గిరాకీ లేకుండా పోతుందని నెత్తీనోరు బాదుకున్నాయి. అనేక ఆందోళనలు సైతం చేశాయి. కానీ, పాలకులకు అవేవీ కనిపించలేదు. పీవీ నర్సింహారావు కాలం నుంచి ఇప్పటి మోదీ పాలన దాకా విదేశీ వస్తువుల దిగుమతికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు.

వారికి అనేక రకాల సౌకర్యాలు కల్పించారు. దీంతో విదేశాల నుంచి ఇబ్బడిముబ్బడిగా దేశంలోకి ఆ వస్తువులు దిగుమతి అయ్యాయి. వాటికి దిగుమతి సుంకం కూడా తక్కువగా విధించడంతో మనదేశంలో వాటి ధరలు తక్కువయ్యాయి. వినియోగదారులు కూడా తక్కువకు లభించే విదేశీ వస్తువులనే కొనడం ప్రారంభించారు. దీంతో దేశంలోని అనేక పరిశ్రమలు మూతపడ్డాయి. లక్షలాది మంది కార్మికులు ఉద్యోగాలు పోయి రోడ్డున పడ్డారు. అయినా పాలకుల్లో ఎలాంటి మార్పూ రాలేదు. స్వదేశీ వస్తువులు వద్దు.. విదేశీ వస్తువులు ముద్దు అన్న చందంగా వ్యవహరించారు. ఇప్పుడు కాలం మోదీసార్‌కు పాఠం నేర్పిందట. అందుకే అందరూ యమా అర్జంటుగా స్వదేశీ వస్తువులనే వాడాలని సెలవిచ్చారు. ఇప్పటికైనా విదేశీ వస్తువుల కంటే స్వదేశీ వస్తువులే మేలన్న విషయం తెలిసినందుకు సంతోషిద్దాం. కానీ, ఈ మాట మాటలకే పరిమితమా.. లేక సర్కారు ఆచరణలో కూడా చూపి స్వదేశీ వస్తువుల అమ్మకాలకు సహకరిస్తుందా.. లేక విదేశీ వస్తువులపైనే మక్కువ చూపుతుందా.. అన్న అనుమానం దేశ ప్రజల్లో వ్యక్తమవుతోంది. స్వదేశీ వస్తువుల అమ్మకాలకు సర్కారు సహకరించి దేశంలోని కార్మికులకు అండగా నిలబడుతుందని ఆశిద్ధాం.!

You might also like