పెద్దపల్లి: దారుణ హత్యకు గురైన అడ్వకేట్ గట్టు వామన్ రావు ఆడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. మంథని కాంగ్రెస్ ఎమ్మెల్యే డి.శ్రీధర్ బాబు ను దూషిస్తూ వామన్ రావు మరొకరితో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
వామన్ రావు ఒక వ్యక్తితో మాట్లాడిన ఆడియో ఒకటి లీకయ్యింది. శ్రీధర్ బాబు అనుభవిస్తున్న పదవి తాను పెట్టిన బిక్షేనని వామన్ రావు కామెంట్ చేశాడు.
ఇరవై సంవత్సరాలుగా నేను శ్రీధర్ బాబు కుటుంబానికి దూరంగా ఉన్ననని, త్వరలోనే నేనంటే ఏమిటో చూపిస్తానని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో పుట్ట మధు, శ్రీధర్ బాబు బాధితులు ఎంతో మంది ఉన్నారన్నారని, వారందరూ మీకు అండగా ఉంటారని ఎదుటి వ్యక్తి చెప్పారు. నీవు పోటీ చేస్తే నాకు ఇబ్బంది అని తన శరణు కోరాడని, ఇటీవల ఒక ఫంక్షన్ కు వెళ్లగా శ్రీధర్ బాబు చూసి చూడనట్లుగా వెళ్లారన్నారు. నీతి లేని వ్యక్తి అని, అవసరం ఉంటే ఒకరకంగా లేకుంటే మరో రకంగా ప్రవర్తిస్తాడని వామన్ రావు మండిపడ్డాడు. అయితే అవతల ఉన్న వ్యక్తి అవునా, నిజమా అన్నట్లు స్పందించాడు.
ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోందని, తాము కూడా విన్నామని పెద్దపల్లి పోలీసులు తెలిపారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించి నిర్థారణ చేయిస్తామని పోలీసులు చెప్పారు.