కొలకతా: అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపించడంతో పశ్చిమ బెంగాల్ లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. పాలక టీఎంసీ, బీజేపీ నాయకులు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు.
ఒకప్పటికీ టీఎంసీ నాయకుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు, నటుడు అయిన మిథున్ చక్రవర్తి బీజేపీలోకి చేరేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి ప్రచార వేదికను పంచుకోనున్నారు. అదే రోజు బీజేపీలో చేరతారా లేదా ఆ పార్టీకి మద్దతు ఇస్తారా అనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. గత నెలలో ఆయన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తో సమావేశమయ్యారు. అప్పటి నుంచి మిథున్ బీజేపీకి దగ్గరవుతున్నారంటూ మీడియాలో వార్తలొస్తున్నాయి.
ఇంతకు ముందు ఆయన టీఎంసీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. శారదా చిట్ ఫండ్ కుంభకోణంలో ఆయన పాత్ర ఉండడంతో తన సభ్యత్వానికి రాజీనామా సమర్పించి పార్టీకి దూరంగా ఉంటున్నారు. అనారోగ్య కారణాలను చూపిస్తూ పార్టీ సమావేశాలకు కూడా రావడం లేదు.