FbTelugu

అచ్చెన్న అరెస్ట్‌తో స‌ర్కారుకు చిక్కులేనా!

అచ్చెన్నాయుడు… మాజీ మంత్రి. తాజా ఎమ్మెల్యే. బీసీ వ‌ర్గంలో మంచి గుర్తింపు ఉన్న నాయ‌కుడు కూడా. అవినీతి మ‌చ్చ ఆయ‌న్ను క‌మ్మేసింది. ఇదంతా గ‌త త‌ప్పిదాల ఫ‌లిత‌మా! ప్ర‌తీకారంలో తాను ఒక పావుగా మారాడా! అనేది మ‌రో విష‌యం. ఏమైనా అచ్చెన్న అరెస్ట్‌ను విప‌క్షాలు ఖండించాయి. అధికా పార్టీ మాత్రం ఆయ‌న బీసీ నేత కాదు.. కేవ‌లం టీడీపీ నాయ‌కుడు అంటూ తేల్చేసి చెప్పింది. నిజంగానే… బీసీల నుంచి కూడా ఆయ‌న‌కు అనుకున్నంత అండ కూడా దొర‌క‌లేదు.

ఎవ్వ‌రి నుంచి ప‌రామ‌ర్శ‌లు రాలేదు. గ‌తంలో ఒక మ‌హిళ విష‌యంలో అచ్చెన్న కాస్త దురుసుగా ప్ర‌వ‌ర్తించాడ‌నే అప‌వాదు ఉండ‌నే ఉంది. మంత్రిగా ఉన్న‌పుడు కేవ‌లం త‌న అనుచ‌రులు, కుటుంబానికి మాత్ర‌మే ప‌నులు చేయించుకున్నార‌నే ఆరోప‌ణ‌లూ లేక‌పోలేదు. ఇవ‌న్నీ కొద్దిసేపు ప‌క్క‌న‌బెడితే.. అచ్చెన్నాయుడు అరెస్ట్ వెనుక ఇవిగో అక్ష‌రాలా రూ.150 కోట్ల అవినీతి ఉందంటూ వైసీపీ స‌ర్కారు చూపుతుంది. ఏసీబీ కూడా విజిలెన్స్ లెక్క‌లు ఆధారాలుగా చెబుతుంది.

అంతే.. కానీ.. అచ్చెన్నాయుడు అరెస్ట్‌కు ఒక రోజు ముందు ఫైల్స్ ఆప‌రేష‌న్ చేయించుకున్నాడు. ఆసుప‌త్రిలో ఉండ‌య్యా.. అంటే సారీ.. ఇంట్లో విశ్రాంతి తీసుకుంటూ మందులు వేసుకుంటానంటూ ఇల్లు చేరాడు. మ‌రుస‌టిరోజే ఏసీబీ ఎటాక్‌.. అంతే.. మందులు, ఆప‌రేష‌న్లు, కారుతున్న ర‌క్తం.. ఇవ‌న్నీ డ్రామా అనే ధోర‌ణిలోనే అధికార గ‌ణం కూడా జ‌మ‌క‌ట్టిన‌ట్టుంది. కానీ.. విశాఖ నుంచి విజ‌య‌వాడ వ‌ర‌కూ.. ఏకంగా 20 గంట‌ల‌కు పైగా ప్ర‌యాణం.. కూర్చోవ‌ట‌మే.

అదీ ఎప్ప‌టివో కార్లు.. ర‌క్తం కారుతుండ‌గా ఒక‌చోట ఆపి డ్రెస్సింగ్ చేసుకుని మ‌ళ్లీ కారులో ప్ర‌యాణం.. ఫ‌లితంగా ఆప‌రేష‌న్ చేసిన చోట మ‌ళ్లీ రోగం తిర‌గ‌బెట్టిందంటూ జీజీహెచ్ వైద్యులు తేల్చిచెప్పారు. అంత దూరం ప్రయాణ‌మే కార‌ణ‌మంటూ నిర్ధారించారు. ఆసుప‌త్రిలో ఉంచి మ‌రోసారి ఆప‌రేష‌న్ చేశారు. నాలుగైదు రోజుల్లో కోలుకుంటాడ‌ని చెబుతున్న వైద్యుల్లోనూ ఏదో తెలియ‌ని భ‌యం. ఎందుకంటే.. అచ్చెన్న ఆరోగ్యం ఏ మాత్రం త‌ల‌కిందులైనా వైసీపీ స‌ర్కారు భారీమూల్యం చెల్లంచుకోవాల్సి ఉంటుంది. ఎంత అవినీతి ప‌రుడ‌నే ఆరోప‌ణ‌లు. ఆధారాలున్నా ఆయ‌న కూడా స‌గ‌టు మ‌నిషనే భావ‌న మ‌ర‌చిపోవ‌టాన్ని స‌మాజం గ‌మ‌నిస్తుంది. సానుభూతి ఏ మాత్రం అటువైపు మొగ్గిన‌ట్టు క‌నిపించినా

వెంట‌నే చంద్ర‌బాబు త‌న రాజ‌కీయం చూపుతాడు. అది చాలు.. వైసీపీ ఇరుకులో ప‌డేందుకు. ఇప్ప‌టికే ఎల్జీపాలిమ‌ర్స్ విషయంలో బాధిత కుటుంబాల‌కు కోట్లు కుమ్మ‌రించినా దానితాలూకూ చేదు అనుభ‌వం వైసీపీ చ‌విచూస్తుంది. అనంత‌పురంలోనూ జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి అరెస్ట్ రెడ్డివ‌ర్గంలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇటు బీసీ.. అటు రెడ్డి ఇలా.. వ‌ర్గాలుగా విడ‌దీసేందుకు.. విప‌క్షాల‌కు స్వ‌యంగా అవ‌కాశం ఇచ్చిన‌ట్టుగా ఉంద‌నే గుస‌గుస‌లూ వైసీపీ శ్రేణుల నుంచి వినిపిస్తున్నాయ‌ట‌.

You might also like