FbTelugu

ప్రియుని మోజులో పడి పప్పుకాడతో భర్త హత్య

అనంతపురం: ఈ మధ్యకాలంలో కొందరు మహిళలు భర్తలపై దాడులు చేస్తూ ప్రాణాలు తీసుకున్నారు. ప్రియుడి మోజులో పడి ఒక మహిళ ఏకంగా భర్తను దారుణంగా హత్య చేసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… దొడగట్ట గ్రామానికి చెందిన శ్రీనివాస్ చౌదరి తొమ్మిదేళ్ల క్రితం సరిత అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. వీరికి 7 సంవత్సరాల కూతురు కూడా ఉంది. మొన్నటి వరకు వీరి సంసారం బాగానే సాగింది. గత కొద్ది నెలలుగా సరిత అదే గ్రామానికి చెందిన ప్రభాకర్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్నది. ఈ విషయం శ్రీనివాస్ కు తెలిసిన వెంటనే భార్యపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన ప్రవర్తన మార్చుకోవాలని పలుమార్లు సూచించాడు.

ఎంత చెప్పినా భార్య వినకుండా అతనితోనే గడుపుతుండడంతో విసుగు చెందిన శ్రీనివాస్ చౌదరి మద్యానికి బానిసయ్యాడు. ప్రతినిత్యం అక్రమ సంబంధం విషయమై భార్యభర్తల మధ్య గొడవలు జరిగేవి. ఆదివారం మరోసారి భర్త తాగి రావడంతో సరిత అతనితో గొడవపడింది. నన్నే ప్రశ్నిస్తావా అంటూ ఆమె మద్యం మత్తులో ఉన్న అతని పై పప్పు కాడతో తలపై బలంగా కొట్టింది. దీంతో శ్రీనివాస్ అక్కడికక్కడే మరణించాడు. ఆ తర్వాత ప్రియుడితో కలిసి హత్యని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది.శ్రీనివాస్ శవాన్ని చెట్టుకు ఉరేసి ఆత్మహత్య చేసుకున్నాడని లబోదిబోమన్నది. ప్రియుడు ప్రభాకర్ తో కలిసి కోడలు సరిత తన కుమారున్ని దారుణంగా హత్య చేసిందని శ్రీనివాస్ తండ్రి రామచంద్రప్ప పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు ప్రియుడు ప్రభాకర్, సరితను అరెస్టు చేసి విచారిస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.