FbTelugu

కరోనాతో కలిసి జీవించే వ్యూహం రూపొందించాలి

అధికారులను ఆదేశించిన సీఎం కేసీఆర్

హైదరాబాద్: కరోనా వ్యాప్తి నివారణ చర్యలు తీసుకుంటూనే, కరోనా వైరస్ తో కలిసి జీవించే వ్యూహం రూపొందించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

కరోనా ఎంతకాలం ఉంటుందో ఎవరికీ తెలియని పరిస్థితి ఉందని, కాబట్టి కరోనా ప్రభావం ఉన్నప్పటికీ జీవితం ఎలా సాగాలనే విషయంలో ఖచ్చితమైన వ్యూహం, ప్రణాళిక అవసరమని ఆయన అన్నారు. కరోనా వ్యాప్తి నివారణ చర్యలు, లాక్ డౌన్ అమలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు.

‘‘కరోనా వ్యాప్తి నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలి. వైరస్ వచ్చిన వారికి ఇప్పటి మాదిరిగానే అత్యుత్తమ సేవలు అందాలి. కాంటాక్ట్ వ్యక్తుల పరీక్షలు జరగాలి. ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకకుండా ఖచ్చితమైన క్యారంటైన్ నిబంధనలు పాటించాలి. ఇప్పటికే అన్ని రకాల పరికరాలు, మందులు, సదుపాయాలతో సిద్ధంగా ఉన్నాం. అందులో సందేహం లేదు’’ అని సీఎం అన్నారు.

‘‘కరోనాతో పోరాడుకుంటూనే ఇతరత్రా కూడా సిద్ధం కావాల్సి ఉంది. కొన్ని ఆర్థిక కార్యకలాపాలు సాగాలి. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో కొన్ని సడలింపులు అమలవుతున్నాయి. కొన్ని పనులు జరుగుతున్నాయి. ఈ పరిస్థితిలో భవిష్యత్తులో సడలింపులను ఎలా అమలు చేయాలి? ఏ జోన్ లో ఎలాంటి వ్యూహం అనుసరించాలి? దేన్ని అనుమతించాలి? దేన్ని అనుమతించకూడదు? హైదరాబాద్ విషయంలో ఏ చర్యలు తీసుకోవాలి? ఇతర జిల్లాల్లో ఎలా వ్యవహరించాలి? ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి. ఏయే రంగానికి ఏ సడలింపులు ఇవ్వాలి? ఏ విషయాల్లో కఠినంగా వ్యవహరించాలి?’’ తదితర అంశాల్లో అధికారులు లోతుగా ఆలోచించి, ప్రభుత్వానికి తగిన ప్రతిపాదనలు ఇవ్వాలని సీఎం కేసీఆర్ కోరారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.