FbTelugu

తహశీల్దార్ ఆఫీసులో పెట్రోల్ సీసా కలకలం

/A-petrol-bottle-in-the-Tahsildar-office

తంగళ్లపల్లి: రెండు నెలలుగా తహశీల్దార్ కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా పని కాకపోవడంతో విసుగు చెందిన ఒక రైతు ఇవ్వాళ పెట్రోల్ తో వచ్చాడు. పెట్రోల్ సీసాతో ఎందుకు వచ్చావని ఆర్ఐ ప్రశ్నించడంతో, పనిచేయనందుకే పెట్రోల్ సీసాతో వచ్చానంటూ రైతు సమాధానమిచ్చాడు. తహశీల్దార్ కార్యాలయం సిబ్బంది నచ్చచెప్పడంతో ఆ రైతు సీసా తీసుకుని వెళ్లిపోయాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కార్యాలయం చోటుచేసుకున్నది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

తంగళ్లపల్లి మండలంలోని రామన్నపల్లె గ్రామానికి చెందిన కావటి లింగయ్య బద్దెనపల్లి గ్రామానికి చెందిన పన్యాల నర్సారెడ్డి వద్ద 0.29 గుంట భూమిని కొనుగోలు చేశాడు. ఐదు నెలల క్రితం కొనుగోలు చేసిన భూమి పట్టా మార్పిడి కోసం లింగయ్య గత రెండు నెలలుగా తిరుగుతున్నాడు. ఈరోజు రేపు అంటూ అధికారులు తిప్పించుకున్నారు. అబ్దుల్లాపూర్ మెట్ మండలంలో జరిగిన ఘటనను స్ఫూర్తిగా తీసుకున్న లింగయ్య గురువారం తహసీల్దార్ కార్యాలయానికి పెట్రోల్ సీసాతో వచ్చాడు. రైతును గమనించిన ఆర్‌ఐ సంతోష్ పెట్రోల్ సీసాతో ఎందుకు వచ్చావంటూ భయంగా ప్రశ్నించాడు. తమ గ్రామానికి చెందిన మిత్రులు పెట్రోలు తీసుకురమ్మన్నారని అందుకే తీసుకోచ్చానని లింగయ్య ప్రతిగా సమాధానమిచ్చాడు. దాడి చేయడానికే తీసుకువచ్చావంటూ సంతోష్ నిలదీయడంతో, ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. అక్కడున్న సిబ్బంది, రైతులు లింగయ్యను నచ్చచెప్పి ఇంటికి పంపించారు.

Tags:
You might also like