FbTelugu

అజిత్ దోవల్ నివాసంలో కీలక సమావేశం

ఢిల్లీ: జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ నివాసంలో ఆదివారం హిందూ సంఘాల నేతలు, ముస్లిం సంఘాల నేతల కీలక సమావేశం జరిగింది. అయోధ్యపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించిన తర్వాత ఈ సమావేశం నిర్వహించడం విశేషం. హిందూ ప్రతినిధులుగా స్వామీ పరమార్థానంద, అవధీశానంద స్వామీజీ, పేజావర్ పీఠాధిపతి విశ్వేశతీర్థ స్వామీజీతో పాటు ముస్లిం సమాజం నుంచి మౌలానా ఆజాద్ యూనివర్శిటీ అధ్యక్షుడు ప్రొఫెసర్ అఖ్త్రుల్ వసే, నవీద్ హమీద్, మౌలానా సయీద్ అహ్మద్ నూరీతో తదితరులు హాజరయ్యారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశానికి మొత్తం హిందూ సంఘాల నుంచి 18 మంది ప్రతినిధులు, ముస్లిం సంఘాల నుంచి 12 మంది ప్రతినిధులు హాజరయ్యారు. అయోధ్యపై తీర్పు వెలువడిన నేపథ్యంలో ఈ తీర్పును ఆసరాగా చేసుకొని దేశం లోపల, వెలుపల కొన్ని శక్తులు లేనిపోని ఉద్రిక్తతలను రేపే అవకాశం ఉన్నందున దీనిపై తగు జాగ్రత్తలు తీసుకునేందుకు ఈ సమావేశం జరిగినట్లు సమాచారం. సుప్రీం తీర్పు వెలువడగానే ఇరు వర్గాలు, భారతీయులు తమ బాధ్యతను, సంయమనాన్ని ప్రదర్శించారని ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేశారు.

You might also like