FbTelugu

మేయర్ కు ఒక న్యాయం? ప్రజలకు మరో న్యాయం?

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ కోవిడ్-19 పరీక్షలు నిర్వహించారు.

ఇవాళ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో వైద్య, ఆరోగ్య సిబ్బంది రామ్మోహన్ నుంచి నమూనాలు సేకరించారు. శుక్రవారం (నిన్న) మేయర్ డ్రైవర్ కు కరోనా పాజిటివ్ రావడంతో మేయర్ నుంచి మరోసారి నమూనాలు తీసుకున్నారు.

ఇదివరకు ఒకసారి నమూనాలు తీసుకోగా నెగెటివ్ అని వచ్చింది. ఒక కార్యక్రమానికి వెళ్లిన ఆయన టీ స్టాల్ వద్ద టీ తీసుకున్నారు. టీ ఇచ్చిన యజమానికి కరోనా పాజిటివ్ రావడంతో ఆ వెంటనే మేయర్ రామ్మోహన్ పరీక్షలు నిర్వహించుకున్న విషయం తెలిసిందే.

ఇప్పుడు మరోసారి పరీక్ష కోసం నమూనాలు ఇచ్చారు. ఒకరికి వస్తే ఆ కుటుంబం లేదా సంబంధం ఉన్న వ్యక్తులకు పరీక్షలు చేయాల్సిన అవసరం లేదని సీఎం కేసీఆర్, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. సామాన్యులు పరీక్షలు చేయాలని కోరుతున్నా చేయకుండా, మేయర్ కు మరోసారి పరీక్షలు నిర్వహించడం ఎంత వరకు న్యాయమని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. మేయర్ కు ఒక న్యాయం, ప్రజలకు మరో న్యాయమా అని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేయర్ కు మరోసారి అనుమానం వస్తే మళ్లీ కరోనా పరీక్షలు నిర్వహిస్తారా అని గ్రేటర్ ప్రజలు భగ్గుమంటున్నారు.

You might also like