FbTelugu

మరీ ఇంత దారుణమా!

భారతదేశంతో పాటు ప్రపంచంలోనూ నానాటికీ స్త్రీలకు, బాలికలకు రక్షణ లేకుండా పోతోంది. వారిపై నిత్యం అఘాయిత్యాలు జరుగుతుండడాన్ని చూస్తూనే ఉన్నాం. చిన్న పిల్లల నుంచి వృద్దుల వరకు అత్యాచారాలకు గురవుతూనే ఉన్నారు. వాటిని అరికట్టేందుకు ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు రాకపోగా ఇంకా ఎక్కువవుతూనే ఉన్నాయి. ఇలాంటి దారుణాలు ఏ స్థాయిలో జరుగున్నాయనే విషయం తెలిస్తే రెండు చేతులూ జేబుల్లో పెట్టుకొని ఎక్కడికో వెళ్లిపోవాల్సిందే. ప్రపంచంలోని ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు తమ జీవితంలో ఏదో ఒక సమయంలో లైంగిక హింసకు గురయ్యారట. ఏంటీ నమ్మలేక పోతున్నారా.. కానీ, ఈ విషయం చెప్పింది ప్రపంచ ఆరోగ్య సంస్థే కాబట్టి నమ్మి తీరాల్సిందే. ఈ విషయంపై సర్వే నిర్వహించిన ఆ సంస్థ ఇటీవల ఓ నివేదికను వెల్లడించింది. ఈ ఆశ్చర్యకర విషయాలను ఆ నివేదికలో పొందుపర్చింది. ప్రపంచంలోని ప్రతి దేశంలోనూ మహిళలపై లైంగిక హింస కొనసాగుతోందని తెలిపింది. 15నుంచి 24 సంవత్సరాల వయస్సుగల వారు ఎక్కువగా ఈ హింసకు బలవుతున్నారట.

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 736 మిలియన్ల మంది మహిళలు లైంగిక హింసకు గురయ్యారని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలో వెల్లడించింది. ఆడపిల్లల మీద లైంగిక దాడులు ఒక్క భారతదేశంలోనే కాదండోయ్‌.. ఎంతో అభివృద్ధిని సాధించిన దేశాల్లోనూ కొనసాగుతోందంటే మహిళల పరిస్థితి ఎంత దారుణంగా తయారవుతోందో అర్ధమవుతోంది. ఇంకా వీటి సంఖ్య భారీగా పెరుగుతుండడం మరింత ఆందోళనను కలిగిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో తమకు రక్షణ ఎలా దొరుకుంతుందన్న భయం వారిని మహిళలను వెంటాడుతోంది. మహిళలపై జరుగుతున్న ఈ దాడులను అరికట్టేందుకు ప్రభుత్వాలు కఠిన చట్టాలను అమలు చేయడంతో పాటు ప్రజల్లో కూడా ముఖ్యంగా యువతీ యువకుల్లో తీసుకురావాలని సామాజికవేత్తలు కోరుతున్నారు. మొత్తానికి ప్రపంచవ్యాప్తంగా మహిళలు ఇంతటి దారుణాలకు గురి కావడం అందరినీ ఆశ్చర్యపరిచే అంశమే. దీనిని అడ్డుకునేందుకు మనమూ మనకు తోచినంతగా పాటుపడదాం.

You might also like

Leave A Reply

Your email address will not be published.