FbTelugu

ఇంటర్ లో 60 శాతం పాస్: సబితారెడ్డి

హైదరాబాద్‌: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితా రెడ్డి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం  ఫలితాలను విడుదల చేశారు. రెండు సంవత్సరాలకు కలిపి మొత్తం 9.50 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.

మొత్తం 60.01 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని ఆమె  తెలిపారు. ఇంటర్‌ ప్రథమ సంవత్సర ఫలితాల్లో 2,88,383 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారన్నారు. ప్రథమ సంవత్సర ఫలితాల్లో బాలికలదే పైచేయి అని వివరించారు. 67.47 శాతం బాలికలు ఉత్తీర్ణత సాధించారని, బాలురు 52.30 శాతం మంది పాసయ్యారని సబితారెడ్డి వివరించారు.

ద్వితీయ సంవత్సర ఫలితాల్లో 2,83,462 మంది (68.86 శాతం) విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సర ఫలితాల్లోనూ బాలికలే పైచేయి సాధించారని చెప్పారు. 75.15 శాతం బాలికలు, బాలుర ఉత్తీర్ణత శాతం 62.10గా నమోదైందని ఆమె వెల్లడించారు. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో 75 శాతం ఉత్తీర్ణతతో మేడ్చల్‌ జిల్లా తొలి స్థానంలో నిలవగా ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో 76 శాతం ఉత్తీర్ణతతో ఆసిఫాబాద్ జిల్లా తొలి స్థానంలో నిలిచిందని ఆమె తెలిపారు. సప్లిమెంటరీ పరీక్షల ఫీజుల, ఎప్పుడు నిర్వహించేది త్వరలో వెల్లడిస్తామని సబితారెడ్డి అన్నారు. మీడియా సమావేశంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్, ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ పాల్గొన్నారు.

You might also like