FbTelugu

54 రోజుల తర్వాత.. అయినా..!

తెలంగాణలో 54 రోజుల తర్వాత మంగళవారం ఉదయం నుంచి ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కుతున్నాయి. హైదరాబాద్‌ నగరంలోని సిటీ బస్సులు మినహా ఇతర జిల్లాలకు బస్సులు నడపాలని సోమవారం కేసీఆర్‌ ఆదేశించారు.

ఈ ఆదేశాల ప్రకారం తెలంగాణలో మంగళవారం తెల్లవారుజామునుంచి బస్సులు డిపోల్లోనుంచి బయటకు వచ్చాయి. హైదరాబాద్‌ నుంచి వివిధ ప్రాంతాలకు కూడా బస్సుల రాకపోకలు ప్రారంభమయ్యాయి. అయితే, జిల్లాల నుంచి హైదరాబాద్‌కు రాకపోకలు సాగిస్తున్న బస్సులను అధికారులు ఎంజీబీఎస్‌కు అనుమతించడం లేదు.

నల్లగొండ వైపు నుంచి వచ్చే బస్సులను ఎల్‌బీనగర్‌ వరకు, వరంగల్‌ నుంచి వచ్చే వాటిని ఉప్పల్, మహబూబ్‌నగర్‌ నుంచి వచ్చేవాటిని ఆరాంఘర్‌ వరకు, కరీంనగర్‌ నుంచి వచ్చే బస్సులను జేబీఎస్‌ వరకు మాత్రమే అనుమతిస్తున్నారు. కరోనా వైరస్‌ రాకుండా అధికారులు ఇప్పటికే బస్సులను పూర్తిగా శానిటైజ్‌ చేశారు. సీటింగ్‌ ఏర్పాట్లలో కూడా భౌతికదూరం ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు.

బస్సులో 50శాతం మంది ప్రయాణికులకే అనుమతి ఇస్తున్నారు. నిలబడి ప్రయాణించడానికి అధికారులు అనుమతులు ఇవ్వడం లేదు. అయితే, మొదటి రోజు ప్రయాణికుల తాకిడి ఎక్కువగా ఉంటుందని భావించి చాలామంది ప్రయాణించడానికి ముందుకు రాలేదు. దీంతో చాలా ప్రాంతాల్లో బస్సులు, బస్టాండ్లు ప్రయాణికులు లేక వెలవెలబోయాయి. మధ్యాహ్నం తర్వాత ఇది కొంచెం పుంజుకునే అవకాశాలున్నాయని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.

హైదరాబాద్‌ నగరంలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉండడంతో సిటీ బస్సులను నడపడం లేదు. అయితే, ఆటోలు, క్యాబ్‌లకు అనుమతి ఇవ్వడంతో అవి కూడా రోడ్డెక్కాయి. ఆర్టీసీ బస్సులకు కూడా అంతర్రాష్ట్ర సర్వీసులకు అనుమతి లేకపోవడంతో రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల వరకు అధికారులు బస్సులను నడుపుతున్నారు. మొత్తానికి 54 రోజుల తర్వాత బస్సులు రోడ్డెక్కడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

You might also like