FbTelugu

త్వరలోనే రోజుకు 40వేల టెస్టులు: కేటీఆర్

హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తుతం రోజుకు 23వేల కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని, త్వరలోనే ఈ సంఖ్యను 40వేలకు పెంచనున్నట్లు మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా 1200 సెంటర్లలో పరీక్షలు నిర్వహిస్తున్నారని ఆయన వివరించారు. తెలంగాణలో కరోనా మరణాలు రేటు 1 శాతం కన్నా తక్కువగా ఉండగా, 72శాతం రికవరీ రేటుతో దేశంలోనే మెరుగ్గా ఉన్నామన్నారు. ఇవాళ ట్విట్టర్ వేదిక ఆస్క్ కేటీఆర్ సెషన్ ను మంత్రి కేటీఆర్ నిర్వహించారు. పలువురు నెటిజన్లు ప్రశ్నలు సంధించారు. వాయిదా పడిన పరీక్షల పై స్పష్టత ఇవ్వాలని ఒక విద్యార్థి కోరగా, విద్యా శాఖ మంత్రి సబితారెడ్డితో సంప్రదించి వెల్లడిస్తామని కేటీఆర్ తెలిపారు.
పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుపై మీ వైఖరి ఏంటని ఒక నెటిజన్ ప్రశ్నించగా, కృష్ణా జలాల్లో న్యాయంగా మనకు చెందాల్సిన వాటా కోసం పోరాడుతున్నామని, సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటీషన్ కూడా దాఖలు చేశామన్నారు. రాజకీయాల్లో మీకు నర్చిన నేత కేసీఆర్ కాకుండా మరెవరైనా ఉన్నారా అని అడగ్గా, అమెరికా మాజీ అధ్యక్షుడు బారక్ ఒబామా అని సమాధానమిచ్చారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు రానున్నాయని, త్వరలోనే ఆ వివరాలు బహిరంగరుస్తామన్నారు. ఏపీ సీఎం జగన్ రెడ్డితో తమకు సత్సంబంధాలు ఉన్నాయని, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఏమాత్రం రాజీపడే ప్రశ్న లేదన్నారు.

You might also like