ఫలించిన మూడు నెలల నిరీక్షణ
హైదరాబాద్: లాక్డౌన్ ఆంక్షల కారణంగా అమెరికాలో చిక్కుకుపోయిన ప్రవాస భారతీయులు హైదరాబాద్ చేరుకున్నారు.
గురువారం అర్ధరాత్రి ఖతర్ ఎయిర్వేస్కు చెందిన ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు 250 మంది వరకు వచ్చారు. అంతకు ముందు వీరు అమెరికాలోని షికాగో, న్యూయార్క్, డాలస్ నగరాల నుంచి ఖతర్ ఎయిర్‌వేస్‌కే చెందిన మూడు ప్రత్యేక విమానాల్లో దోహా చేరుకున్నారు. అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చారు.
విమానం శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకోగానే భావోద్వేగ సన్నివేశాలు కనిపించాయి. ఇన్నాళ్లకు సొంతగడ్డపై అడుగు పెట్టామని ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు. వారిని బంధుమిత్రులు ఆత్మీయంగా స్వాగతించారు. వారిని క్వారంటైన్ కోసం నోవాటెల్ హోటల్‌కు తరలించారు.