ప్రయాణీకుడిని టచ్ చేయకుండా సెన్సార్లు
ఎయిర్పోర్టు ను సందర్శించిన సీఎస్ సోమేశ్ కుమార్
హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దేశీయ విమానాల రాకపోకలు నేడు ప్రారంభమయ్యాయని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వెల్లడించారు.
లాక్ డౌన్ కారణంగా గత రెండు నెలలుగా నిలిచిన విమాన ప్రయాణాలు నేడు మళ్లీ ప్రారంభమయ్యాయని తెలిపారు. దేశంలోని వివిధ ప్రధాన నగరాలనుండి హైదరాబాదుకు, ఇక్కడినుండి ఇతర నగరాలకు దేశీయ విమానాల రాకపోకలు ప్రారంభం కావడంతో సోమేష్ కుమార్ ఏర్పాట్లను తనిఖీ చేశారు.
ఈ సందర్బంగా మీడియాతో సోమేశ్ కుమార్ మాట్లాడుతూ, నేడు 19 విమానాలు హైదరాబాద్కు రావడంతో పాటు మరో 19 విమానాలు హైదరాబాద్ నుండి ఇతర రాష్ట్రాలకు వెళ్లడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రధానంగా ఎయిర్ పోర్ట్ నుండి వెళ్లే ప్రయాణికులకు, ఇతర నగరాల నుండి వచ్చే ప్రయాణికులకు బాడీ టెంపరేచర్ ను పరీక్షించడం జరుగుతుందని అన్నారు. టెంపరేచర్ తో కరోనా లక్షణాలుంటే రెగ్యులర్ ప్రోటోకాల్ పాటిస్తారన్నారు.
ప్రయాణీకుడిని టచ్ చేయకుండా సెన్సార్లు ఏర్పాటు చేసామని చెప్పారు. ఇప్పటి వరకు వచ్చినవారిలో ఎవరికి కూడా కరోనా లక్షణాలు లేవని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల ప్రకారం సెక్యూరిటీ పరంగా, ఆరోగ్య పరంగా ఎయిర్ పోర్ట్ లో అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని వివరించారు. ఆరోగ్య సేతు యాప్ తప్పనిసరి అని,ఆరోగ్య సేతు యాప్ ఉన్నవాళ్లనే అనుమతిస్తున్నామన్నారు.
పరీక్షల అనంతరమే అనుమతిస్తున్నామని, ఎలాంటి కరోనా లక్షణాలు లేని వారికి 14 రోజుల క్వారంటైన్ లేదని తెలిపారు. దాదాపు 1600 మంది ఇతర రాష్ట్రాల నుండి నేడు హైదరాబాద్కి వస్తున్నారన్నారు. రేపటి నుండి మరిన్ని విమాన సర్వీస్లు పెరిగే అవకాశం ఉందని, దీనిని దృష్టిలో పెట్టుకొని మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. విమానాశ్రయంలోకి ప్రవేశించిన దగ్గరి నుండి విమానం ఎక్కేదాకా భౌతిక దూరం పాటించాలన్నారు. ప్రయాణికుల లగేజీతో పాటు ట్రాలీ వాహనాలను కూడా పూర్తిగా శానిటైజ్ చేసేందుకు ప్రత్యేక టన్నెల్ ను ఏర్పాటు చేశారని సోమేష్ కుమార్ వివరించారు.