FbTelugu

రోజుకు 147మంది..!

కరోనా విలయతాండవం చేస్తోంది. ఇండియాలో అది ముందు వరుసలో ఉంది. రోజుకు 70వేల నుంచి 90వేల దాకా కొత్తగా కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా భారీగానే ఉంటోంది.

ఇదే పరిస్థితి తెలంగాణలో కూడా ఉంది. అయితే, ప్రభుత్వాల నిర్ణయాల కొన్నివర్గాల వారు తీవ్రంగా ఇబ్బందులు పడడమే కాదు కరోనా బారిన కూడా పడుతున్నారు. అది కూడా ఒకరిద్దరు కాదు.. రోజుకు 147 మంది దాకా కరోనా బాధితులుగా మారుతున్నారు.. తెలంగాణలో ఉపాధ్యాయులు పాఠశాలలకు వెళ్లాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో గత నెల 27నుంచి ఉపాధ్యాయులు పాఠశాలలకు వెళ్తున్నారు. ఈ నెల నుంచి విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాసులు జరుగుతున్నాయి.

ఈ కాలంలో టీచర్లు విద్యార్థులు ఆన్‌లైన్‌ క్లాసులు వింటున్నారా.. లేదా అని విద్యార్థుల ఇళ్లకు వెళ్లి చూడాలి. ఇదే టీచర్లకు అశనిపాతంలా మారింది. ఇలా ఊరిలోని అనేకమందికి ఇళ్లకు రోజూ తిరుగుతుండడం, పాఠశాలలకు బస్సులు, ఆటోల్లో కిక్కిరిసి వెళ్లడం వల్ల ఉపాధ్యాయులు భారీగా కరోనా బారిన పడుతున్నారు. పాఠశాలలకు వెళ్తున్న ఉపాధ్యాయులు కరోనా బారిన పడుతున్నారని వివిధ ఉపాధ్యాయ సంఘాలు విమర్శలు చేశాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం గత నెల 27 నుంచి ఇప్పటి వరకు కరోనా బారిన పడిన ఉపాధ్యాయుల వివరాలను సేకరించింది.

దీంతో ప్రభుత్వంతో పాటు ఉపాధ్యాయులకు దిమ్మదిరిగే నిజాలు వెలుగు చూశాయి. కేవలం 16 రోజుల్లోనే 2350మందికి కరోనా సోకినట్టు తేలింది. ఇది రానున్న కాలంలో మరింతగా పెరిగే ప్రమాదమున్నందున్న ప్రభుత్వం వెంటనే దీనిపై స్పందించి ఉపాధ్యాయులు కరోనా బారిన పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

You might also like