హైదరాబాద్: తెలంగాణ పీసీసీ పై అభిప్రాయ సేకరణ పూర్తయింది. ఎవరిని ఎంపిక చేస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకుంటుందనే అంశంపై జిల్లా పార్టీ అధ్యక్షుల (డీసీసీ) నుంచి సలహాలు కోరారు.
రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జీ మాణిక్కం ఠాకూర్ హైదరాబాద్ లో రెండు రోజులు పాటు గాంధీ భవన్ లో కూర్చుని డీసీసీలతో పాటు పీసీసీ కమిటీ సభ్యులు, ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్థానంలో ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై ఆయన పలువురు నుంచి సూచనలు, సలహాలు కోరారు. పార్టీ శ్రేయస్సు దృష్ట్యా ఎవరిని ఎంపిక చేస్తే బాగుంటుందని మాణిక్కం అడిగారు.
పీసీసీ అధ్యక్ష పదవి రేసులో మల్కాజిగిరి ఎంపీ ఎ.రేవంత్ రెడ్డి తో పాటు భువనగరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముందు వరుసలో ఉన్నారు. వీరితో పాటు సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి కూడా పోటీ పడుతున్నారు. రెండుసార్లు సికింద్రాబాద్ పార్లమెంటు స్థానం నుంచి ఓటమి పాలైన అంజన్ కుమార్ యాదవ్ సైతం తనకు పీసీసీ పీఠం కావాలంటూ దరఖాస్తు చేసుకున్నారు.
రేవంత్ రెడ్డి కి పార్టీ పగ్గాలు అప్పగించాలనే దానిపై జిల్లాల వారీగా బలబలాలు ఇలా ఉన్నాయి. అనుకూలంగా 20 జిల్లాల డీసీసీ అధ్యక్షులు, వ్యతిరేకంగా 13 జిల్లాల అధ్యక్షులు ఉన్నారు. అనుకూలంగా ఉన్న జిల్లాల్లో కరీంనగర్, జగిత్యాల, నిజామాబాద్, అదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, మహబుబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మహబూబ్ నగర్, నారాయణపేట, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్ ఉన్నాయి.
వ్యతిరేకించిన జిల్లాల్లో మంచిర్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగామ, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి ఉన్నాయి.