FbTelugu

జగ్గయ్యపేట ప్రమాదంలో 10 మంది మృతి

జగ్గయ్యపేట: కృష్ణా జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పది మంది దుర్మరణం చెందారు. జగ్గయ్యపేట మండలం వేదాద్రి వద్ద ట్రాక్టర్‌ – లారీ ఢీకొన్నది.

దైవ దర్శనం చేసుకుని ట్రాక్టర్‌లో తిరుగు ప్రయాణిస్తున్న ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ఏడుగురు మహిళలు ఉన్నారు. గాయపడిన 14 మంది క్షతగాత్రులను జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ట్రాక్టర్ లో ప్రయాణిస్తున్న వారు ఖమ్మం జిల్లా గోపవరం గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. వేదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దర్శనానికి వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఎదురుగా వస్తున్న సిమెంట్‌ లారీ వీరు ప్రయాణిస్తున్న ట్రాక్టర్‌ను బలంగా ఢీకొట్టడంతో పల్టీలు కొట్టింది. ట్రాక్టర్‌లో 30 మంది వరకు ప్రయాణిస్తున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

ఈ ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు, గాయపడిన వారికి అవసరమైన సహాయం అందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.