FbTelugu

సీఎం కేసీఆర్ కు ‘అల్లం’ పెద్ద ఉత్తరం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడెమీ ఛైర్మన్ అల్లం నారాయణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కు పెద్ద లేఖ రాశారు.

కరోనా మహమ్మారి, జర్నలిస్టుల స్థితిగతులు, మీడియా సంస్థల ఆటుపోట్లు, చిన్న పత్రికలకు రెండేళ్ల నుంచి ఒక్క అడ్వర్టయిజ్ మెంటు నిరాకరణ వంటి అంశాలపై అల్లం నారాయణ సుధీర్ఘంగా వివరించారు.

ఇటువంటి పరిస్థితులో గుర్తింపు పొందిన జర్నలిస్టులను ఆర్థికంగా ఆదుకునేందుకు తక్షణమే రూ.25 కోట్లు మంజూరు చేయాలని సీఎం కేసీఆర్ ను ఆ లేఖలో కోరారు. లేఖలో పేర్కొన్న అంశాల ఇలా ఉన్నాయి.

 

తేది: 01.06.2020.

గౌరవ ముఖ్యమంత్రివర్యులు,

శ్రీ కె. చంద్రశేఖర్ రావు గారికి,

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, హైదరాబాద్.

 

ఆర్యా,

నమస్కారం.

విషయము:-  తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి, హైదరాబాద్ – తెలంగాణ న్యాయవాదులను ఆదుకున్న విధంగానే తెలంగాణ జర్నలిస్టులకు రూ.25 కోట్ల తక్షణ సహాయం – గుర్తింపు కలిగిన ప్రతి జర్నలిస్టుకు రూ.10 వేల ఆర్థిక సహాయం – జర్నలిస్టుల సంక్షేమ నిధికి రూ.65.50 కోట్ల నిధుల విడుదల గురించి – విజ్ఞప్తి.

కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో మీడియా సంస్థలు అనేక ఆటుపోట్లకు గురవుతున్నాయి. ఈ సంక్షోభ సమయంలో పత్రికల పేజీలను కుదించడం, పంపిణీ వీలు కాకపోవడం వలన పత్రికల సర్క్యులేషన్ విపరీతంగా తగ్గి సంక్షోభంలో పడ్డాయి. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కరోనా వైరస్ వ్యాప్తి వల్ల వార్తల సేకరణ పని విధానం కూడా మార్చుకోవలసి  వచ్చింది. వీటికి తోడు ప్రభుత్వం నుంచి కాని, వాణిజ్య పరంగా కాని ప్రకటనలు జీరో స్థాయికి తగ్గడం వలన పత్రికలు, చానళ్ల నిర్వహణ సంక్షోభంలో పడింది.

ఈ కష్ట సమయంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా యాజమాన్యాలు ఒక దిక్కు ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం, మరో వైపు వేతనాల కోత ద్వారా వ్యయాలను తగ్గించుకుని తమని  తాము రక్షించుకునే ప్రయత్నం చేస్తున్నాయి.

పత్రికలు, చానళ్లు, అన్ని మీడియా సంస్థలు అదే బాటలో జర్నలిస్టుల జీత, వేతనాలలో కోత పెడుతున్నాయి. జర్నలిస్టులకు ఉద్యోగాల నుంచి ఉద్వాసన పలుకుతున్నాయి. మరోవైపు చిన్న పత్రికలకు రెండు సంవత్సరాల నుంచి ఒక్క ప్రకటన కూడా జారీ కాలేదు. ఆదుకోవలసిన ప్రభుత్వం నుండి కనీసమైన ప్రకటనల సహకారం కొరవడింది. ఫలితంగా చిన్న పత్రికలు కూడా సంక్షోభంలో పడ్డాయి. ఈ పరిస్థితులలో ప్రభుత్వం ఒక బాధ్యతగా మీడియా రంగాన్ని రక్షించుకోవడానికి ఈ చర్యలు తీసుకోవలసిందిగా కోరుతున్నాము.

అత్యవసర సర్వీసులైన వైద్యం, పారిశుద్ద్యం, పోలీసులతో సమానంగా జర్నలిస్టులు కూడా 24 గంటలు ప్రమాదకర వాతావరణంలో విధులు నిర్వహిస్తున్నారు. సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు విపరీతంగా ప్రచారం అవుతున్నాయి. ప్రజలకు తప్పుడు సమాచారం వెళుతున్నందున ప్రామాణిక సమాచారంతో పత్రికలు, చానళ్లు ఒక గురుతర బాధ్యత నిర్వహిస్తూ ప్రజలకు సరైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తున్నాయి. వైద్యులు, పారిశుద్ద్య కార్మికులు, పోలీసులతోపాటు మీడియా సిబ్బంది కూడా కనీసమైన రక్షణ లేని పరిస్థితులలో పని చేస్తున్నారు. అందువలన మీడియాను అత్యవసర సేవలుగా పరిగణించి భీమా సౌకర్యం, రక్షణ సౌకర్యాలు కల్పించడానికి ప్రతిపాదిస్తున్నాము.

అట్లాగే ఇలాంటి క్లిష్ట సమయంలో ఎలాంటి ఆదాయం లేని వర్గాలకు ప్రభుత్వం సహాయం అందించిన విధంగా (ఉదాహరణకు న్యాయవాదులను ఆదుకున్న విధంగా) మీడియా రంగాన్ని, జర్నలిస్టులను ఆదుకోవాలని కోరుతున్నాము.

 

 1. తెలంగాణ న్యాయ వాదులను ఆదుకున్న విధంగానే తెలంగాణ జర్నలిస్టులకు 25 కోట్ల తక్షణ సహాయం ప్రకటించాలి.
 2. గుర్తింపు కలిగిన ప్రతి జర్నలిస్టుకు 10 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించాలి. దీని కోసం తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి ద్వారా మార్గదర్శకాల రూప కల్పన జరగాలి.
 3. తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి ద్వారా ఈ చర్యలన్ని తీసుకోవడానికి అకాడమిని ఆర్థికంగా బలోపేతం చేయాలి. జర్నలిస్టుల సంక్షేమ నిధి క్రింద ప్రభుత్వం రూ.100 కోట్లు ప్రకటించింది. ఇందులో రూ.34.50 కోట్ల నిధులు మాత్రమే విడుదల అయ్యాయి. మిగతా రూ.65.50 కోట్లు తక్షణమే విడుదల చేస్తే మీడియా అకాడమి కార్యకలాపాలు సజావుగా కొనసాగుతాయి.
 4. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాను ఆదుకోవడానికి ప్రభుత్వం తక్షణమే ప్రకటనలు జారీ చేయాలి.
 5. మీడియా యాజమాన్యాలు జర్నలిస్టులను తొలగించడం, జీత వేతనాలకు కోత విధించడం వంటి విధానాలు పాటించకుండా ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలి.
 6. యాజమాన్యాలు ఎలాంటి నోటీసులు లేకుండా ఉద్యోగులను తొలగించడం, కనీసం నష్ట పరిహారం చెల్లించకుండా కార్మిక చట్ట నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. అందువలన మీడియా సంస్థలలో పని చేస్తున్న జర్నలిస్టుల విషయంలో కార్మిక చట్టాలను తు.చ. తప్పకుండా పాటించాలి.
 7. ప్రతి జర్నలిస్టు కరోనా న్యూస్ కవరేజీలో పూర్తి రక్షణలో ఉండే విధంగా ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేయాలి.
 8. ప్రతి జర్నలిస్టుకు కరోనా కిట్ (మాస్క్, సానిటైజర్, పి.పి.ఇ. కిట్, గ్లౌజ్) సరఫరా చేయాలి.
 9. జర్నలిస్టులకు రూ.20 లక్షల ప్రమాద భీమా వర్తింప జేయాలి.
 10. కంటైన్మెంట్, రెడ్ జోన్ వంటి ప్రాంతాలలో రిపోర్టు చేస్తున్న జర్నలిస్టులకు విధిగా కరోనా పరీక్షలు నిర్వహించాలి.
 11. తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి తరుఫున కరోనా బారిన పడిన జర్నలిస్టులకు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. జీత వేతనాలు లేని దాదాపు పన్నెండు వందల మంది జర్నలిస్టులకు మీడియా అకాడమి తరఫున అత్యవసర సరుకులు కూడా ఇచ్చి సహాయపడ్డాము.
 12. జర్నలిస్టులకు జారీ చేసిన హెల్త్ కార్డులను అన్ని ఆరోగ్య సమస్యలకు కార్పొరేట్ ఆసుపత్రులలో వైద్యం అందే విధంగా, టెస్ట్ లకు కూడా వర్తించే విధంగా చర్యలు తీసుకోవాలి.
 13. ప్రెస్ క్లబ్, హైదరాబాద్ కార్యక్రమాలు యథావిధిగా కొనసాగించడానికి రూ.50 లక్షల కార్పస్ ఫండ్ మంజూరు చేయాలి.

 

అల్లం నారాయణ,

చైర్మన్, తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి,

హైదరాబాద్.

You might also like

Leave A Reply

Your email address will not be published.