FbTelugu

బావి మృతుల దర్యాప్తుకై ప్రత్యేక బృందాలు

వరంగల్: గీసుగొండ మండలం గొర్రెకుంట ప్రాంతంలోని బావిలో నుంచి బయటపడిన 9 శవాల మిస్టరీ చేధించేందుకు తొమ్మిది ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. అక్రమ సంబంధం, గ్రూపు తగాదాలు, మద్యం మత్తులో చంపేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

అనుమానాస్పదంగా మరణించిన తొమ్మిదిమంది మృతులకు సంబంధించిన కేసు ఛేదిస్తామని వరంగల్ పోలీస్ కమిషనర్ డా. వి.రవీందర్ శుక్రవారం ప్రకటించారు.

గొర్రెకుంట ప్రాంతంలో వున్న ఒక గన్నీ సంచుల గోదాం వద్ద పాడుబడ్డ బావిలో అనుమానస్పదంగా తొమ్మిది మృతదేహాలు బయటపడిన సంఘటనపై పోలీసు కమిషనర్ రవీందర్ వివరాలు వెల్లడించారు. ఎం.మక్సూద్ ఆలం తన భార్య పిల్లలతో కల్సి కరీమాబాద్ ప్రాంతంలో నివాసం వుంటూ గొర్రెకుంటలోని గన్నీ సంచుల గోదాం పనిచేస్తున్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో గన్నీ గోదాం కు ఇంటికి రాకపోక ఇబ్బంది కావడంతో అక్కడే ఉండాలని నిర్ణయించుకుని ఉంటున్నాడు. గత 45రోజులగా గోదాంలోని భవనంలో కుటుంబం మొత్తం నివాసం ఉంటున్నది. ఇదే భవనంలో బిహార్ రాష్ట్రానికి చెందిన శ్రీరాం, శ్యాంలు కూడా ఉంటున్నారు.

గురువారం ఉదయం 7.30లకు యజమాని జూలూరి భాస్కర గోదాంకు చేరుకున్నాడు. గోదాంలో ఎలాంటి సంచారం లేకపోవడం ఆశ్చర్యపోయాడు. ఇక్కడే ఉంటున్న మక్సూద్, మక్సూద్ భార్య నిషా, కుమార్తె బుస్రా, మనుమడు మక్సూడ్, చిన్నకుమారుడు సొహైయిల్, పెద్ద కుమారుడితో పాటు బిహార్‌కు చెందిన శ్రీరాం, శ్యాంలు మొత్తం ఎనిమిది మంది కోసం ఆరా తీశఆడు. తన వ్యాపార భాగస్వామి సూర్యదేవర సంతోష్, మిగతా వర్కర్లతో కల్సి కనిపించకుండా పోయిన వారి గురించి వెదికారు.

మధ్యాహ్నం 2గంటల సమయంలో గోదాం ప్రక్కనే వున్న పాడుబడిన బావిలో వీరి ఆనవాళ్లు కన్పించాయి. వెంటనే గీసుగొండ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. ఈ రోజు శవాలను గుర్తించిన పాడుపడిన బావిలో నీటిని తొలగిస్తున్న క్రమంలో మరో ఐదుగురి మృతదేహాలను గుర్తించడం జరిగింది. ఈ సంఘటలో మొత్తం 9మంది  మరణించారని కమిషనర్ తెలిపారు. అన్నికోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని, ఇందుకోసం ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు.

You might also like