FbTelugu

కేంద్రానికి కేరళ సవాల్‌

కేంద్ర ప్రభుత్వానికి కేరళ సవాల్‌ విసిరింది. కేంద్రం ఏది చెప్పినా చేయడానికి రాష్ట్రాలు మీకు తాబేదార్లు కాదని, మావి కూడా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలేనని తేల్చి చెప్పింది.

ప్రజలకు నష్టాన్ని కలిగించే చర్యలను తాము ఎన్నడూ తీసుకోబోమని.. ఈ విషయంలో కేంద్రం నిర్ణయాలను కూడా పట్టించుకునేది లేదని కుండబద్దలు కొట్టి మరీ చెప్పింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్‌ సవరణ చట్టం –2020 బిల్లును తాము పూర్తిగా వ్యతిరేకిస్తామని కేరళ ప్రభుత్వం ప్రకటించింది. ఈ బిల్లు అమలులోకి వస్తే కేంద్రం రాష్ట్రాల అధికారాలను అతిక్రమిస్తుందని పేర్కొంది.

ఈ మేరకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి ఆర్కే సింగ్‌కు లేఖ రాశారు. బిల్లులోని పలు అంశాలను ఉటంకిస్తూ.. వాటివల్ల రాష్ట్రాలకు కలిగే నష్టాలను వివరించారు. విద్యుత్‌ సామాజిక అవసరమని, దానిని ప్రజలకు అందించాల్సిన ప్రధాన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదని గుర్తుచేశారు. పేదలకు, రైతులకు సబ్సిడీపై విద్యుత్‌ను అందించడాన్ని సామాజిక కోణంలో చూడాలన్నారు.

దీనివల్ల ఆర్థిక రంగానికి వచ్చే అదనపు లాభం కంటే సబ్సిడీల వల్ల కలిగే నష్టం చాలా స్వల్పమని వివరించారు. కానీ కేంద్రం ప్రతిపాదించిన బిల్లు సబ్సిడీలకు, క్రాస్‌ సబ్సిడీలకు మంగళం పాడుతుందని పేర్కొన్నారు. సబ్సిడీలను వినియోగదారుల బ్యాంక్‌ ఖాతాలో జమచేసే డీబీటీ విధానం ప్రత్యామ్నాయ మార్గం కానేకాదని విజయన్‌ స్పష్టం చేశారు. ఇది రాష్ట్రాల ఈఆర్సీ పరిధిలోకి కేంద్రం చొచ్చుకురావడమేనని, ఈఆర్సీని నియమించే అధికారాన్ని రాష్ట్రాల నుంచి లాగేసుకోవడమేని తెలిపారు. విద్యుత్‌ కాంట్రాక్ట్‌ అథారిటీ (ఈసీఈఏ) ఏర్పాటుతో.. పీపీఏలను తప్పకుండా అమలుచేయాలని చెప్పడం సరైంది కాదన్నారు.

డిస్ట్రిబ్యూషన్‌ వ్యవస్థలో సబ్‌లైసెన్సీలు, ఫ్రాంచైజీలను రాష్ట్ర ఈఆర్సీ అనుమతి లేకుండా నియమించడం.. విద్యుత్‌ వంటి కీలకమైన రంగంలో ఉన్న నియంత్రణ విధానానికి వ్యతిరేకమైనదని స్పష్టంచేశారు. తాజా బిల్లులో పేర్కొన్న అంశాలన్నీ విద్యుత్‌ రంగాన్ని ప్రైవేటీకరించేందుకు, రాష్ట్రాల పాత్రను గణనీయంగా తగ్గించేందుకు ఉద్దేశించినదిగా కనిపిస్తున్నదని విజయన్‌ ఆరోపించారు. కేంద్రం ఈ బిల్లును ఉపసంహరించుకొని రాష్ట్రాలతో చర్చలు జరుపాలని కోరారు. ఈ బిల్లును యథాతథంగా అంగీకరించే ప్రసక్తేలేదని ఆయన తేల్చిచెప్పారు. కేంద్రం నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేసేది లేదని తెగేసి చెప్పారు. అయితే, కేంద్రం ఒంటెత్తు పోకడలను కేరళ సర్కార్‌ నిలదీసినట్టుగా మిగతా రాష్ట్రాలు నిలదీస్తాయా అన్న చర్చ కూడా ఆయా రాష్ట్రాల్లో జరుగుతోంది. ఆ ప్రభుత్వాలు కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకించి పేదల పక్షాన నిలుస్తాయా.. కేంద్రం నిర్ణయాలకు జైకొట్టి పేదల పొట్టకొడతాయా చూడాలి మరి.!

You might also like

Leave A Reply

Your email address will not be published.